ప్రజలు కూడా జీవన శైలిని మార్చుకొని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి : ప్రధాని

మిషన్ లైఫ్ ను ప్రారంభించిన ప్రధాని

pm-modi-will-visit-adi-sankaracharya-house-in-kerala

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ గుజరాత్ కెవడియాలో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అంటోనియా గుటేరస్ తో కలిసి మిషన్ లైఫ్ ప్రోగ్రాంను ప్రారంభించారు. అనంతరం మోడీ ప్రసంగించారు. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మిషన్ లైఫ్ సహాయం చేస్తుందని చెప్పారు. వాతావరణ మార్పుల సమస్య ప్రపంచం అంతటా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన హిమానీ నదులు కరిగిపోతున్నాయని, నదులు ఎండిపోతున్నాయని ఆయన చెప్పారు. ప్రజలు కూడా జీవన శైలిని మార్చుకొని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ప్రధాని సూచించారు. ప్రపంచంలోని 80 శాతం కాలుష్యం జీ 20 దేశాల్లో ఉందని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అంటోనియా గుటేరస్ తెలిపారు. అందుకే జీ 20 దేశాలు పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేయాలని సూచించారు. వ్యక్తులు, సంఘాలు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని గుటేరస్ చెప్పారు.

కాగా, సుస్థిర అభివృద్ధి దిశగా ప్రజల సమిష్ఠి వైఖరిని మార్చడానికి త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయడమే మిషన్ లైఫ్ లక్ష్యం. సులువుగా, సమర్థవంతంగా ఉండే పర్యావరణ హితకరమైన పనులు చేసేవిధంగా ప్రజలను ప్రోత్సహించడం, ఈ పనులను ప్రజలు తమ దైనందిన జీవితంలో ఆచరించే విధంగా ప్రేరేపించడం, మారుతున్న డిమాండ్‌కు తగినట్లుగా వేగంగా స్పందించేవిధంగా పరిశ్రమలు, మార్కెట్లను ప్రోత్సహించడం, సుస్థిర వినియోగానికి, ఉత్పత్తికి మద్దతునిచ్చే విధానాలను రూపొందించాలని ప్రభుత్వాలను, పరిశ్రమలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యాలు. ఇక అంతకు ముందు దేశంలోనే మొట్టమొదటి సోలార్ పవర్డ్ గ్రామాన్ని, మొధేరాలోని సూర్య దేవాలయాన్ని గుటేరస్ సందర్శించారు.