వైసీపీ అభ్య‌ర్థిగా మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి నామినేష‌న్..

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌ రెడ్డి నామినేషన్ వేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతం రెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు స్థానాన్ని సోదరుడు విక్రమ్‌రెడ్డికి వైసీపీ అధిష్టానం పోటీకి అవకాశం కల్పించింది. దీంతో ఇవాళ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వైసీపీ నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తదితరుల సమక్షంలో నామినేషన్‌ దాఖలు చేశారు.

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం విక్రమ్ రెడ్డి బీ ఫారం అందుకున్న సంగతి తెలిసిందే. నామినేషన్ కు ముందు బైపాస్‌రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయంలో విక్రమ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నెల్లూరు సెంటర్‌ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు.

ఈ సందర్బంగా విక్రమ్ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేపడతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల తాను ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమాను వ్యక్తం చేశారు. నామినేషన్‌కు వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు అందరూ రావడం సంతోషం. ఈ ఎన్నికలు నాకు కొత్త. అయినా సీరియస్‌గా తీసుకుని పని చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం’ అని తెలిపారు. జూన్ 23వ తేదీన ఆత్మకూరు ఉప ఎన్నిక జరుగనుండగా, 26వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.