మెగా డీఎస్సీ .. మంత్రి బుగ్గన ఇంటి ముట్టడికి ఎన్ఎస్‌యూఐ నేతల యత్నం

Mega DSC .. Attempt of NSUI leaders to besiege Minister Buggana’s house

అమరావతిః మెగా డీఎస్సీ వేయాలంటూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా నేడు నంద్యాల జిల్లా డోన్‌లో ఇదే డిమాండ్‌తో ఎన్ఎస్‌యూఐ నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రికి వినతిపత్రం అందించేందుకు ఎన్ఎస్‌యూఐ నేతలు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను పట్టుకునే ప్రయత్నంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ కిందపడ్డారు. అనంతరం నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కాగా, నిన్న కూడా ఇదే డిమాండ్‌తో యూత్ కాంగ్రెస్ నేతలు మంత్రి అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి యత్నించారు. సత్తెనపల్లిలోని ఆయన ఇంటికి చేరుకున్న నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. వీరిని అడ్డుకునేందుకు వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.