కాలేజీ వ్యాన్‌ ఢీకొని జీహెచ్‌ఎంసీ కార్మికురాలు మృతి

మరో నలుగురు విద్యార్థులకు గాయాలు

medical-college-bus-kills-ghmc-worker-at-ramkote

హైదరాబాద్ః హైదరాబాద్ లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కాలేజీ బస్సు అదుపుతప్పి రోడ్డుపై విధుల్లో ఉన్న జీహెచ్ఎంసీ కార్మికురాలు పైకి దూసుకెళ్లింది. దీంతో స్వీపర్ అక్కడికక్కడే చనిపోగా.. నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ లోని అయాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీకి చెందిన బస్సు రాంకోఠిలో అదుపుతప్పింది. సోమవారం ఉదయం విద్యార్థులను కాలేజీకి తీసుకెళ్తుండగా రాంకోఠిలో కంట్రోల్ తప్పి రోడ్డ ఊడుస్తున్న జీహెచ్ఎంసీ కార్మికురాలు సునీతను ఢీ కొట్టి, ఆ పక్కనే ఉన్న చెట్టును తాకి ఆగింది.

ఈ ప్రమాదంలో చెట్టుకు, బస్సుకు మధ్యలో నలిగి సునీత అక్కడికక్కడే చనిపోయింది. మరో నలుగురు విద్యార్థినులు కూడా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో రాంకోఠిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బస్సు డ్రైవర్ మహ్మద్ గౌస్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అతడిపై కేసు నమోదు చేశామని నారాయణగూడ పోలీసులు తెలిపారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ ప్రమాదంపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు. కార్మికురాలు సునీత మృతిపై విచారం వ్యక్తం చేసిన మేయర్.. సునీత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.