ఎన్టీఆర్‌ శతజయంతి స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి

Commemorative Rs 100 NTR Coin’ Releases At Rashtrapati Bhavan President Droupadi Murmu

న్యూఢిల్లీ: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ.. స్మారక నాణెం విడుదల ఎన్టీఆర్‌కు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ ఒక తరానికే కాకుండా.. తరతరాల వారికి హీరో అన్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందం కలిగించిందనీ.. ఆయన కూతురిగా ఇది తన అదృష్టం అన్నారు. ఎన్టీఆర్ జీవితం ఎందరికో ఆదర్శం అని తెలిపారు. భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్‌ ఎంతో ప్రత్యేకమని రాష్ట్రపతి అన్నారు. రాముడు, శ్రీకృష్ణుడు ఇలా ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారని ప్రశంసించారు. సీనీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఎనలేని సేవలు అందించారని ద్రౌపది ముర్ము మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టిడిపి అధినేత చంద్రబాబు, బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, నందమూరి బాలకృష్ణతోపాటు ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

కాగా, కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించిన ఎన్టీఆర్‌ స్వయం కృషితో సినీ, రాజకీయ రంగాలపై చెరగని ముద్రవేశారు. చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆయన సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా శత జయంతి సంవత్సరం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక 100 నాణేన్ని ముద్రించింది.