నేడు సమ్మక్క-సారలమ్మ వన ప్రవేశం

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతుంది. ఆసియా ఖండంలోనే పెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం జాతర వనదేవతలను గౌరవించే అపురూపమైన జాతర . ఒకప్పుడు గిరిజనులు మాత్రమే జరుపుకునే ఈ జాతర ఇప్పుడు ప్రజలందరూ విశేషంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మేడారం జాతరలో చివరి రోజు నేడు తుది ఘట్టంతో మేడారం జాతర ముగియనుంది. 4 రోజుల మహా జాతర నేడు అమ్మవార్ల వనప్రవేశంతో ముగియనుంది. గద్దెలపై కొలువుదీరిన తల్లులను నిన్న ఒక్క రోజే 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు ఇంటికి తిరుగు ముఖం పట్టడంతో మేడారం-తాడ్వాయిపై వాహనాల రద్దీ నెలకొంది.

నాలుగురోజుల మహాజాతరలో భాగంగా తొలిరోజు పగిడిద్దరాజు, గోవిందరాజులు, జంపన్న మేడారం గద్దెలపైకి రాగా, ఆ తర్వాత రోజు సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం తీసుకువచ్చారు. ఇక మాఘశుద్ధ పౌర్ణమి నాడు చిలకలగుట్టపై కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్కను, సమ్మక్క పూజారులు గద్దెలపైన ప్రతిష్టించారు. సమ్మక్క రాకతో మేడారం జాతర ఊపందుకుంది. నేడు జాతరలో చివరి ఘట్టమైన అమ్మవార్లు వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది.