రైలు దిగే ప్రయత్నంలో కిందికి జారిపోయిన విద్యార్థి శశికళ మృతి

విశాఖలోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కునిపోయి తీవ్రంగా గాయపడిన విద్యార్థిని శశికళ కన్నుమూసింది. అన్నవరం నుంచి దువ్వాడ వచ్చిన ఆమె.. రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు ఆమె రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కునిపోయింది. సుమారు గంటన్నరపాటు యువతి రైలు, ప్లాట్‌ఫాం మధ్యనే నరకయాతన అనుభవించారు. చివరికి గంటన్నరపాటు శ్రమించిన రైల్వే సిబ్బంది.. యువతిని బయటకు తీశారు.

ప్లాట్ ఫాం పగలగొట్టిన సిబ్బంది.. యువతిని సురక్షితంగా బయటకు తీశారు. కానీ అప్పటికే ఆమె బ్లాడర్, నడుం భాగం ఎముకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం జరిగింది. బయటకు తీయగానే విద్యార్థినిని షీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది. దాంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. శశికళ దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీయే చదువుతోంది. ఆమె మరణవార్తలో కాలేజీలో విషాద వాతావరణం నెలకొంది.