మాయావతి ఇంట్లో విషాద ఛాయలు

బహజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఇంట్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. మాయావతి తల్లి రాంరతి (92) నేడు ఢిల్లీలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో దేశ రాజధానిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. శనివారం తుది శ్వాస విడిచినట్లు పార్టీ తెలిపింది. గతేడాది నవంబర్ 19న మాయావతి తండ్రి ప్రభుదయాల్ మరణించారు. ఆయన మరణించి ఏడాది కూడా గడవకముందే తల్లి మరణించడం తో మాయావతి తీవ్ర విషాదంలో మునిగారు.

ఈ విషయమై బీఎస్‌పీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘అత్యంత దు:ఖకరమైన వార్త. బీఎస్‌పీ జాతీయ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మాయావతి తల్లి రాంరతి కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో మరణించారు. తల్లి అంత్యక్రియల నిమిత్తం కుమారి మాయావతి ఢిల్లీకి బయలుదేరారు’’ అని రాసుకొచ్చారు. తల్లి మరణవార్త విని మాయావతి హుటాహుటీన లక్నో నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మాయవతి తల్లి అంత్యక్రియలు రేపు ఢిల్లీలో నిర్వహించనున్నారు. రామ్రాటి మృతి పట్ల బీఎస్పీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలియజేస్తున్నారు.