ప్ర‌యాణాల‌తో ఒమిక్రాన్ శ‌ర‌వేగంగా వ్యాప్తి: ఆంధోనీ ఫౌసీ

90 శాతం దేశాలను ఒమిక్రాన్ చుట్టేసింది

న్యూయార్క్‌: ప్రపంచంపై ఒమిక్రాన్ విజృంభణ మొదలైంది. నెమ్మదిగా అన్ని దేశాలను చుట్టేస్తున్న ఈ వేరియంట్ యూకేను అతలాకుతలం చేస్తోంది. దీని దెబ్బకు దేశాలన్నీ నెమ్మదిగా మళ్లీ ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి. మరోవైపు, అమెరికాలోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు, అధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ స్పందించారు.

ఒమిక్రాన్ శరవేగంతో ప్రపంచాన్ని చుట్టుముడుతోందని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయడమంటే ముప్పును కొనితెచ్చుకోవడమేనని హెచ్చరించారు. ఇప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. ఒమిక్రాన్‌తో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, మాస్కులు ధరించడం మానొద్దన్నారు.

ఇప్పటికే ఈ వేరియంట్ 90 దేశాలను చుట్టుముట్టేసిందని, అమెరికాలోని సగానికిపైగా రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయని పేర్కొన్నారు. ఒమిక్రాన్ కారణంగా న్యూయార్క్‌లో పాజిటివిటీ రేటు 8 శాతం దాటింది. అయితే, ఊరటనిచ్చే విషయం ఏమిటంటే.. ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత తక్కువగా ఉండడం. కాగా, దక్షిణాఫ్రికా, యూరప్ దేశాల్లో ఈ వేరియంట్ భయపెట్టేలా వ్యాప్తి చెందుతోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/