కాంగ్రెస్ పార్టీ కి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్ కు మర్రి శశిధర్ రెడ్డి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడంతో..ఆయనపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. అధిష్టానం నిర్ణయం తర్వాత మర్రి శశిధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి..తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. బాధగానే కాంగ్రెస్‌తో బంధం తెంచుకుంటున్నానన్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో కాంగ్రెస్‌ విఫలమైందన్నారు. పార్టీ ముఖ్య నాయకురాలు సోనియా గాంధీకి కూడా లేఖ రాశానని మర్రి శశిధర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. పార్టీలో పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందన్నారు. ప్రజల కోసం పని చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందన్నారు. కాంగ్రెస్‌కు చేతి గుర్తు సూచించిన వారిలో తన కూడా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానని, ఇలాంటి పరిస్ధితి వస్తుందని తాను ఊహించలేదన్నారు. పీసీసీ చీఫ్‌లకు ఇంఛార్జ్‌లు ఏజెంట్‌లుగా మారిపోయారని, ఇదే కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ అని శశిధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.