భార్యను చూసేందుకు జైలు నుంచి ఇంటికి వెళ్లిన సిసోడియా

Manish Sisodia Reaches Home From Tihar Jail To Meet Ailing Wife

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత మనీష్‌ సిసోడియా శనివారం జైలు నుంచి బయటకు వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు మధురా రోడ్డులోని నివాసానికి వెళ్లారు. మనీలాండరింగ్‌ కేసులో తీహార్ జైలు లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సిసోడియా కోర్టు అనుమతితో శనివారం ఉదయం 10 గంటలకు ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ఆయన తన భార్యతోనే ఉండనున్నారు.

కాగా, భార్య అనారోగ్యంతో ఉందని తనను కలుసుకునేందుకు అనుమతించాలంటూ సిసోడియా గతంలో కోర్టుకు విన్నవించుకున్న విషయం తెలిసిందే. తన భార్యను కలుసుకునేందుకు 5 రోజులపాటు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు సిసోడియాకు అనుమతి ఇచ్చింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఇంట్లో తన భార్యను కలిసేందుకు అనుమతిచ్చింది. అయితే, ఎలాంటి రాజకీయ సమావేశాలు, ప్రసంగాలు నిర్వహించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం సిసోడియా జైలు నుంచి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం తిరిగి జైలుకు వెళ్లిపోనున్నారు.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కుంభకోణంతో మనీష్‌ సిసోడియాకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏడాదిన్నర క్రితం సీబీఐ, ఈడీ అధికారులు సిసోడియాను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్‌ స్కామ్‌ కేసును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రెండూ విచారిస్తున్నాయి. ఈ క్రమంలో మనీష్‌ సిసోడియాను రెండు దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులూ ప్రశ్నిస్తున్నారు.