నేడు పంజాబ్ లో రూ.42,750 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన

న్యూఢిల్లీ: నేడు ప్రధాని మోడీ పంజాబ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో దాదాపుగా రూ. 42,750 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఢిల్లీ-అమృతసర్-కత్రా ఎక్స్‌ప్రెస్ వే, కపుర్తలా, హెషియార్పూర్ లతో రెండు కొత్త మెడికల్ కాలేజీలకు మొదలైన వాటికి శంకుస్థాపన చేయనున్నారు.

2014లో పంజాబ్ లోని జాతీయ రహదారుల మొత్తం పొడవు 1700 కిలోమీటర్లు ఉండగా.. 2021 నాటికి 4,100 కిలోమీటర్లకు చేరిందని పీఎంవో తెలిపింది. అందులో భాగంగా పంజాబ్‌లో రెండు ప్రధాన రహదారి కారిడార్‌లకు శంకుస్థాపన జరగనుంది. ప్రధాన ధార్మిక కేంద్రాలకు ప్రాప్యతను పెంపొందించాలనే ప్రధాన మంత్రి దార్శనికతను నెరవేర్చడానికి ఇది ఒక ముందడుగు అని కూడా పేర్కొంది.

669 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం రూ.39,500 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇది ఢిల్లీ నుండి అమృత్‌సర్, ఢిల్లీ నుండి కత్రాకు ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గిస్తుంది. కాగా, మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా రైతు ఉద్యమం కొనసాగిన తరువాత మొదటిసారిగా ప్రధాని పంజాబ్ లో పర్యటించనున్నారు. ఈ ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/