గొప్ప మనసు చాటుకున్న మంచు లక్ష్మి

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు నటి మంచు లక్ష్మి తన గొప్ప మనసు చాటుకుంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో 30 పాఠశాలలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. గత కొన్నేళ్లుగా టీచ్ ఫర్ ఛేంజ్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న లక్ష్మి.. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.

ఇప్పటికే ఏపీలో వెనుకబడిన జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయగా..తెలంగాణ లోని యాదాద్రి జిల్లాలో 56 పాఠశాలలను దత్తత తీసుకున్నారు. అక్కడ కంప్యూటర్ ల్యాబులతో పాటు ఇతరత్రా వసతులను సమకూర్చారు. వాటిలో విద్యార్థులకు మెరుగైన విద్య అందుతూ వస్తోంది. అంఇక దుకే ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో మరో 30 పాఠశాలలను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు లక్ష్మి.

విద్యాసంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా దత్తత తీసుకున్న పాఠశాలల్లో పనులు ప్రారంభిస్తామని లక్ష్మీప్రసన్న తెలిపారు. డిజిటల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ విద్యతో పాటు మౌలిక వసతులు కల్పించనున్నట్టు చెప్పారు. ఆగస్టు నాటికి పనులు పూర్తిచేస్తామని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందాలన్నదే తమ అభిమతమన్నారు. భవిష్యత్ లో టీచ్ ఫర్ ఛేంజ్ స్వచ్ఛంద సంస్థ సేవలను మరింత విస్తృతపరుస్తామని లక్ష్మీ పేర్కొన్నారు.