దేశానికి జాతీయ భాషంటూ ఏదీలేదు..అన్ని భాషల్లాగే హిందీ ఒకటిః మంత్రి కెటిఆర్

హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిద్దాం..

minister-ktr

హైదరాబాద్‌ః ఐఐటీలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని మంత్రి కెటిఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని కెటిఆర్‌ అన్నారు. ‘భారతదేశానికి జాతీయ భాషంటూ ఏదీలేదు. అన్ని భాషల్లాగే హిందీ కూడా ఒక అధికార భాష మాత్రమే. ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీని తప్పనిసరి చేస్తున్నారు. తద్వారా ఎన్డీఏ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది. భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలి. హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిద్దాం’ అని మంత్రి కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు.

ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, నాన్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, నవోదయ విద్యాలయాల్లో హిందీ మీడియం మాత్రమే అమలు చేయాలని అమిత్ షా కమిటీ ప్రతిపాదించింది. కేవలం.. తప్పనిసరి అనుకున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించాలని.. అక్కడ కూడా నెమ్మదిగా ఇంగ్లీష్ స్థానంలో హిందీని భర్తీ చేయాలని ప్రతిపాదించారు.

ప్రస్తుతం ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షల్లో.. తప్పనిసరిగా ఉన్న ఇంగ్లీష్ స్థానంలో హిందీ పేపర్‌ను కంపల్సరీ చేయాలని ప్రతిపాదించారు. ఎంపిక చేసే ఉద్యోగులకు కూడా హిందీపై అవగాహన ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు ఆదేశాల్లోనూ హిందీ అనువాదం ఉండేలా చూడాలని.. తీర్పులు కూడా హిందీలోనే ఇచ్చే అవకాశం కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/