హన్మకొండ బిజెపి సభ ఫై మంత్రి ఎర్రబెల్లి సెటైర్లు

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర వరంగల్ లో ముగిసింది. ఈ సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిధిగా జెపి నడ్డా హాజరు కాగా తెలంగాణ బిజెపి నేతలు , కార్య కర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సభలో బిజెపి నేతలు టిఆర్ఎస్ సర్కార్ ఫై విమర్శల వర్షం కురిపించారు.
సభ పై, ఆ సభలో మాట్లాడిన బీజేపీ నేతల తీరుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. వారు మాట్లాడిన తీరు చిల్లరగా ఉందన్నారు. అబద్ధాలు వల్లించారని, ఈ సభతో బీజేపీ వైఖరి మరోసారి స్పష్టమైందని అన్నారు. వరంగల్‌లో నడ్డా సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్న ఆయన.. ఎందుకు చేస్తున్నరో తెలియని, ప్రజా సంగ్రామ యాత్ర 3వ విడత ముగింపు సభ జనం లేక వెలవెల బోయిందన్నారు. ఎలాగైనా సభను నింపేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాన్ని పిలిపించారని ఎర్రబెల్లి అన్నారు. ఈ సభలో కూడా అవే పాత బెదిరింపులు చేశారని విమర్శించారు.
‘‘తెలంగాణకు విముక్తి కలిస్తామని అన్నాడు. అయ్యా! నడ్డా గారు.. మేం ఆల్ రెడీ ప్రజల మద్దతుతో ఉద్యమించి, తెలంగాణను విముక్తం చేసుకున్నాం. ఇక జరగాల్సింది బిజెపి విముక్త భారతం. ప్రజలు ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. అందుకే మీరు ఈ మత చిచ్చులు పెట్టి ప్రజల్ని చీల్చుతున్నారు’ అంటూ దుయ్యబట్టారు. మత చిచ్చులు పెట్టి, ప్రజలను విడగొట్టి, చిల్లర రాజకీయాలు చేసి, పచ్చని తెలంగాణలో బీజేపీ మంటలు పెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? కేంద్రం డబ్బులిస్తే కేసీఆర్ ఖర్చు చేయడం లేదట! కేంద్రం ఇచ్చిందేంది? మీరు తెలంగాణకు తెచ్చిందేంటో చెప్పాలని డిమాండ్ చేసారు.