కరీంనగర్ యాదమ్మ చేతి వంట రుచి చూడబోతున్న ప్రధాని మోడీ

కరీంనగర్ యాదమ్మ వంట అంటే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకే తెలుసు..కానీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాదమ్మ వంట గురించి మాట్లాడుకోబోతున్నారు. జులై 2 నుండి హైదరాబాద్ లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ తో పాటు జాతీయ బిజెపి నేతలు , ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు , అధికారులు ఇలా ఎంతోమంది హాజరుకాబోతున్నారు. వారందరికీ తెలంగాణ రుచికరమైన వంటకాలను సిద్ధం చేయబోతున్నారు తెలంగాణ బిజెపి నేతలు. ఇందుకోసం కరీంనగర్‌ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను ఎంపికచేశారు.

గత 29 ఏళ్లుగా వంటలు చేస్తూ ఎంతోమందికి రుచికరమైన వంటను అందిస్తూ ఎంతో పేరు తెచ్చుకున్న యాదమ్మ..ఇప్పుడు మోడీ కోసం వంట చేయబోతుంది. యాదమ్మ స్వగ్రామం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి గ్రామం. 15వ ఏటనే కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. దీంతో కరీంనగర్‌ చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. ఈమె చేసే శాకాహార, మాంసాహార వంటకాలు తిన్నవారు ఆహా అనకుండా ఉండలేరని చెబుతారు.

యాదమ్మ వంటలను ఇప్పటికే తెరాస మంత్రులతో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రుచిచూశారు. ఈక్రమంలో యాదమ్మను బుధవారం బండి సంజయ్‌ హైదరాబాద్‌ పిలిపించుకున్నారు. కొన్ని వంటలు తయారు చేయించి రుచి చూశారు. ఈ సందర్భంగా యాదమ్మ ను మోడీ సమావేశాలకు వంట చేయాలనీ తెలిపారట. సమావేశాల్లో రెండో రోజు పూర్తి శాఖాహార వంటకాలు చేయాలని యాదమ్మతో చెప్పారు. పుంటికూర పప్పు, బగార, దద్దోజనం, పులిహోర, సాంబారూ, గుత్తి వంకాయ, గంగవాయిలి కూర, మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, జొన్న రొట్టెలు, సకినాలు, గారెలు, సర్వపిండి, పెద్ద బూంది లడ్డు వంటకాలను యాదమ్మ ప్రిపేర్ చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు వంటల కోసం తనను కరీంనగర్ నుంచి నోవాటెల్‌కు పిలిపించడం పట్ల యాదమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సార్ తన వంట తింటారంటే అంతకన్నా సంతోషం ఏముంటుందని పేర్కొన్నారు.