తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు

పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నట్టు మొయిత్రాపై ఆరోపణ

Mahua Moitra expelled from Lok Sabha after ethics panel recommendation in cash-for-query row

న్యూఢిల్లీః పార్లమెంటులో వివిధ అంశాలపై ప్రశ్నలు అడగడానికి డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. మొయిత్రా అంశంపై నివేదికను పార్లమెంటు ఎథిక్స్ కమిటీ చైర్మన్ నేడు లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రతిపాదించారు.

కాగా, మహువా మొయిత్రా తీరు అనైతికం అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్ సభ మూజువాణి ఓటు ప్రాతిపదికన ఆమోదించింది.

అయితే విపక్ష సభ్యులు ఈ నివేదికను నిరసించారు. కొత్త పార్లమెంటు భవనంలో ఈరోజు బ్లాక్ డే, ఓ నల్ల అధ్యాయం నేడు మొదలైంది అంటూ కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. మొయిత్రాను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించగానే, విపక్ష సభ్యులు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు.