వ్యక్తులు, వ్యవస్థలు, మీడియా

రాష్ట్రం: మహారాష్ట్ర

kangana ranaut
kangana ranaut

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాం డవం కొనసాగుతూ దేశంలోనే అత్యధిక కొవిడ్‌-19 కేసులు రికార్డు అవుతూ, రికార్డును కొనసాగిస్తుండగా మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం కూడా మరింత ముదురుతోంది.

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్యకేసుతో మొత్తంగా పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. రాజ్‌పుత్‌ సుశాంత్‌ మరణంపై ప్రముఖ సినీనటి కంగనా రనౌత వాఖ్యలు మరింత దుమారం లేపాయి. దీనిపై శివ సేన నేతల స్పందనలు మరింత వేడి పుట్టించాయి.

ఈ నేపథ్యంలో అటు కేంద్రప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశ మైంది. వీటికితోడు ఎలక్ట్రానిక్‌ మీడియా ఈ విష యంలో అత్యధిక దూకుడుతో వ్యవహరించడం మరిన్ని విమర్శలకు తావిచ్చింది.

ఇతర ఏ కీలక సమస్యలు లేనట్లుగా మీడియా అత్యుత్సాహం చూపి ఈ ఉదంతంపై అత్యధిక సమయం ప్రసారాలు చేయ డంతో కొంత మేర అబాసుపాలయినట్లుగా ప్రచారం పెరిగింది. రాష్ట్రంలో, కేంద్రంలో వేర్వేరు రాజకీయ పార్టీలు అధికారంలో ఉండే రాజకీయ దుమారం ఏ స్థాయిలో ఉంటుందో కంగనా ఉదంతం వెల్లడిస్తున్నది.

అతికీలక ఈ వ్యవస్థలు కూడా ఎంతగా దిగ జారాయో ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. కంగనా వంటి సామాన్య వ్యక్తికి ఇంతగా ప్రాచుర్యం లభించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోపాటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కూడా దోహదం చేసినట్లు అయింది.

మధ్యలో ఎలక్ట్రానిక్‌ మీడియా కంగనా తోపాటు సుశాంత్‌సింగ్‌ ప్రియురాలు రియా చక్రవర్తి కూడా మీడియాలో అధికంగానే కనిపిస్తుంది.

ఈ వ్యక్తులు, వ్యవస్థలు, మీడియా అంతా కలిసి సమస్య ను పక్కదారి పట్టించారని, వాస్తవాలు వెలికి తీసేం దుకు ఒకవైపు సిబిఐ విచారణ కొనసాగుతున్నప్పటికీ మీడియా దూకుడుతో ప్రజల్లో మరింత గందరగోళం ఏర్పడింది.

మొత్తం వివాదానికి కీలకాధారం సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడం. అయితే సుశాంత్‌కు వైద్యం అందించిన సైక్రియాటిస్టుల అభిప్రాయాలు కీలకంగా చర్చ జరగాల్సిఉండగా రాజకీయ ప్రమేయం తోడు కావడంతో పరిస్థితిని సంక్లిష్టం చేశారు.

సినీపరిశ్రమ లో స్వయంగా వృద్ధిలోకి వస్తున్న సుశాంత్‌కు మాదకద్రవ్యాలు సేవించే అలవాటు పెరగడంతోపాటు మానసిక రుగ్మతలతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయి, కుటుంబ సమస్యల కంటే వ్యక్తిగత ప్రేమ వ్యవహారంతో ఏర్పడిన తలనొప్పులు వెరసిఆయనను ఆత్మహత్యకు పురిగొల్పి ఉంటాయనేది డాక్టర్లు వెల్లడించిన తొలి సమాచారం.

అయితే సినీ రంగంలో తన అస్థిత్వాన్ని మరిం తగా విస్తృతం చేసుకోవడా నికి కొందరు సినీ ప్రము ఖులు అడ్డుపడ్డారనే విమర్శలున్నప్పటికీ టాలెంట్‌ను ఎల్లకాలం అణగదొక్కడం అసాధ్య మని అనేకసార్లు ఇప్పటికే సినీ పరిశ్రమలో నిరూపితమైంది.

సినీ మాఫియా కూడా సుశాంత్‌ ఆత్మహత్యకు కారణం కావచ్చని కంగనా చేస్తున్న ఆరోపణలలో నిజనిజాలు వెల్లడి కావాల్సి ఉంది.

కేంద్రం అధికారంలో ఉన్న బిజెపి అగ్రనేతలు మహారాష్ట్రలోని శివసేన నేతలపై గుర్రుగా ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా భారతీయ జనతాపార్టీ, శివసేన ఎక్కువ సమయాల్లో మిత్రపక్షాలుగానే కొనసాగాయి.

అయితే ఇటీవలి ఎన్నికల తర్వాత కూడా ఈ రెండు పార్టీలు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సమయాత్తమ య్యాయి.

కాని శివసేన పేచీతో అవి బద్ధశత్రువ్ఞలుగా మారాయి. అధిక అసెంబ్లీ సీట్లు సాధించుకున్న బిజెపి సహజంగానే ముఖ్యమంత్రి పదవిపై పట్టుబట్టింది. దానికి శివసేన ససేమిరా అనడంతోనే వివాదం పెరిగింది.

పైగా అప్పటివరకు శివసేనకు కూడా బద్ధశత్రువ్ఞలుగా ఉన్న పార్టీలకు సయోధ్య కుదుర్చుకుంది. కాంగ్రెసు, ఎన్‌సిపిలతో మైత్రీబంధం కుదిరి మహా సంఘటన ప్రభుత్వం మహారాష్ట్రలో అధికారంలో కొనసాగుతున్నది.

ఈ కూటమిలో శివసేన జతకట్టి ముఖ్యమంత్రి పదవిని పొందడంతో బిజెపి తర్వాతి కాలం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నది.

ఒక దశలో ఈ కూటమిలోని శాసనసభ్యులను ఆకర్షించేందుకు బిజెపి అగ్రనేతలు విఫల ప్రయత్నం చేశారు.

దేశంలో ఆర్థిక రాజధానిగా ప్రసిద్ధి చెందిన ముంబాయిలో పట్టు కోల్పోవడం బిజెపికి మింగుడుపడటం లేదు. దీంతో మహారాష్ట్రలో శివసేనకు ఇబ్బందులు సృష్టించేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా బిజెపి నేతలు ఉపయోగించుకుంటున్నారు.

అందుకే బిజెపి సుశాంత్‌ కేసును శివసేనకు వ్యతిరేకంగా వాడుకుంటున్నది. మహారాష్ట్ర పోలీసులు కేసు దర్యాప్తు సమర్థవంతంగా చేయలేకపోతున్నారనే అప్రతిష్టను తెచ్చారు.

బీహరు పోలీసులను పంపారు. చివరికి సిబిఐతో విచారణ జరుగుతున్నది.

మరోవైపు మాదకద్రవ్యాల వినియోగం కూడా ఉన్నందున నార్కోటక్‌ విభాగం రంగంలోకి దిగింది. ముంబయి లోని పరిస్థితులు పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నాయని కంగనా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపి, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగాధం పెంచింది.

కంగనాను ముంబయిలో అడుగుపెట్టనివ్వమని శివ సైనికుల బెదిరింపుతో వెంటనే కేంద్రం పదకొండుమందితో వై కేటగిరిలో భద్రత కల్పించింది.

అయితే కంగనా తన ఆఫీసు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని మున్సిపాలిటీ ద్వారా భవనం కూల్చివేత చర్య మహారాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చింది.

అయితే శరద్‌పవార్‌ జోక్యంతో శివసేన వెనక్కు తగ్గినా, కంగనా కేంద్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్రంలో శివసేనను బలహీనం చేసేందుకు పావ్ఞలు కదుపుతున్నది.

సందట్లో సడేమియా అన్నట్లుగా ఎలక్ట్రానిక్‌ మీడియా ఉత్సాహం ప్రదర్శిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.

  • కోనేటి రంగయ్య

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/