ఎపిలో రగులుతున్న విద్యుత్‌ మీటర్ల చిచ్చు

కేబినేట్‌లో ఉచిత విద్యుత్‌ నగదు బదలీ మీటర్లకై తీర్మానం

AP-Free electricity ‌ cash transfer
AP-Free electricity ‌ cash transfer

సెప్టెంబర్‌ 3న ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ మీటర్ల బిగింపు అంటూ తీర్మానం చేయడం ఓ పెద్ద సంచ లనం రేపగా,అది పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద చిచ్చునే రేపింది. రెండు రోజుల్లోనే ఆ జ్వాలలు కారుచిచ్చులా అంతటా అంటుకొన్నాయి.

ప్రస్తుతం రైతులకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడం జరుగుతున్నది.అయితే కొత్త విద్యుత్‌ సంస్కరణ ఫలితంగా ఇకపై రైతులకు ఉచిత విద్యుత్‌ బదులు దానికయ్యే డబ్బులు ఆ రైతు ఖాతాలో ప్రతినెలా జమ చేయడం జరుగుతుంది. ఆ డబ్బును రైతు ప్రతినెలా విద్యుత్‌ బిల్లుకు చెల్లించాల్సిఉంటుంది. ఇందువల్ల రైతులకొచ్చే నష్టమేమీ లేదు.

కాకుంటే ప్రతినెలా రైతు ఆ డబ్బును తీసుకొని చెల్లించాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా ప్రయాసతో కూడినపనే. కేంద్ర విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా ఇది తప్పదు. ఇక ఆంధ్రప్రదేశ్‌ ఉచిత విద్యుత్‌కు కాస్త చరిత్ర దాగి ఉంది.అదివరకు 1995-2004లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విద్యుత్‌ ఛార్జీలు విపరీతంగా పెంచడమే కాకుండా, ప్రపంచబ్యాంకు సంస్కరణల సూచన మేర విద్యుత్‌ మీటర్లు బిగించేందుకు కూడా విఫల ప్రయత్నం చేశారు.

చంద్రబాబు పరిపాలనా కాలంలో అనగా ఆగస్టు 23, 2000 సంవత్సరంలో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై నిరసన తెల్పేందుకు అఖిలపక్షం ఆధ్వర్యాన పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఆనాడు ఉచిత విద్యుత్‌కు బద్ధ వ్యతిరేకి అన్న బలమైన ముద్రే 2004లో చంద్రబాబును ఓటమికి గురిచేసింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత విద్యుత్‌కు ఆద్యుడు వై.యస్‌ రాజశేఖర రెడ్డి అన్నది చారిత్రక సత్యం. తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు ఉచిత విద్యుత్‌ ఇవ్వక తప్పిందికాదు. మరి ఈ రోజు వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి నిర్ణ యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయంపై రైతులు రోడ్డెక్కాలని కూడా చంద్రబాబు 5వ తారీఖున పిలుపునిచ్చారు.

ఉచిత విద్యుత్‌ అన్నది ఎవరి భిక్ష కాదు. రైతు సాధించుకున్న హక్కు అనికూడా ఆయన పేర్కొనడం చాలా విడ్డూరం. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసు కొంటున్నట్లు జగన్‌ ప్రభుత్వం పేర్కొనడం వెనుక దాగిన విష యాన్ని తెలుసుకుందాం. 1970 నుంచి కూడా వ్యవసాయ విద్యుత్‌ టారిఫ్‌ విషయంలో వివిధ రాష్ట్రాలు వివిధ పద్ధతుల్ని అనుసరించసాగాయి.

వ్యవసాయ ఉత్పత్తులు పెరగడానికి విద్యుత్‌ ఛార్జీల భారం రైతుపై తగ్గించడానికి రైతుకు తోడ్పాటు చర్యలు అందించారు.శ్లాబ్‌రేట్‌కు విద్యుత్‌,చీప్‌ రేటుకు విద్యుత్‌, పూర్తి ఉచితంగా విద్యుత్‌ ఇలా ఎన్నెన్నో ఆలోచనలు చోటుచేసు కొన్నాయి. అధికారానికి వచ్చిన ఎన్టీరామారావ్ఞ కూడా రైతులకు సబ్సిడీ ధరలకే విద్యుత్‌ అందించారు.

రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌ ప్రవేశపెట్టాక భారతదేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్య మంత్రులు కూడా దీన్ని అమలుపరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉచిత విద్యుత్‌ కొనసాగుతోంది.రానురాను విద్యుత్‌ డిమాండ్‌ అమితంగా పెరిగిపోతున్నది.

2040 సంవత్సరానికి ఇప్పటి కన్నా డిమాండ్‌ డబుల్‌ అయ్యే అవకాశం కలదు. వివిధ రాష్ట్రాలలో వివిధ విధానాలు అవలంబించడం వల్ల డిస్కంలు, జెన్‌కోలకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పెరిగాయి.

ప్రాప్తి నివేదిక ప్రకారం 2020 అక్టోబర్‌కు ఈ బకా యిలు 81,010 కోట్లుగా పెరిగింది. ఇలా భారీగా బకాయిలు పెరిగిపోవడంతో విద్యుత్‌రంగంలో కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. విద్యుత్‌రంగం పూర్తిగా అస్త వ్యస్తంగా మారింది.కొనుగోలులో కూడా పారదర్శకత కొరవ డింది. కొందరు ఎక్కువ ధరకు ఎక్కువ కాలం అగ్రిమెంట్లు చేసుకోవడం కూడా ప్రభుత్వానికి నష్టదాయకంగా మారింది.

మోడీ ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. సోలార్‌పవర్‌ వినియోగంపై కూడా దృష్టి పెట్టింది. విద్యుత్‌రంగాన్ని పూర్తిగా సంస్కరించి అందరికీ మంచి విద్యుత్‌ ను రీజనబుల్‌ రేటుకు అందించాలన్నదే ప్రభుత్వ ఆలోచన.

2019 నుండి విద్యుత్‌ సంస్కరణలపై అనేక సమీక్షలు, సమా వేశాలు నిర్వహించారు.ఎలాగైనా విద్యుత్‌రంగాన్ని ఆర్థికంగా పరిపుష్టి కావించాలన్నదే మోడీ ప్రధాన ఉద్దేశం కూడా. ఇందు కనుగుణంగానే డ్రాఫ్ట్‌ ఎలక్ట్రిసిటీ యాక్ట్‌ (అమెండ్‌మెంట్‌)బిల్‌ 2020ను కేంద్రప్రభుత్వం తీసుకువచ్చింది.

దీనిపై విపక్షాలు పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా కమ్యూనిస్టులు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం నూతన విధానం వల్ల కేంద్రంలో సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌, రాష్ట్రాల్లో స్టేట్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లు పనిచేస్తాయి. దీనిపై స్టాండింగ్‌ కమిటీని సిట్టింగ్‌ జడ్జి సుప్రీం కోర్టు ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేస్తారు.

పిపిఎల టారిఫ్‌ పరిశీలనకు ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ ఆధారిటీ కూడా ఉంటుంది. కొత్త ట్రిబ్యునల్‌ కూడా ఏర్పాటుచేస్తారు.24/7 రోజులూ నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్‌ను అందియడమే సంస్కరణల లక్ష్యం. ఇండియాను విద్యుత్‌ మిగులు దేశంగా తీర్చిదిద్దడం మోడీ ఏకైక లక్ష్యం కూడా.డిస్కంలు, ట్రాన్స్‌కోలకు విపరీతంగా బకాయిలు పెడు తున్నారు.

దీనివల్ల విద్యుత్‌ ఉత్పత్తికి అడ్డు ఏర్పడుతున్నది. ప్రాప్తి నివేదిక ప్రకారం 2020లో డిస్కంలు బకాయిలు 81,010 కోట్లుగా తేల్చాయి.కరోనా మొదటి మూడు నెలలు విద్యుత్‌ వినియోగం,వ్యవసాయ వినియోగం కూడా తగ్గిపో యింది. కేవలం గృహ వినియోగ విద్యుత్‌ డిమాండే పెరిగింది. చాలా నష్టాలు వచ్చాయి.

కేంద్రం నూతన ‘ఉదయ్ 2.0 వల్ల పరిస్థితులు పూర్తిగా మారవచ్చు. ప్రస్తుతమున్న రైతుల మీటర్ల స్థానంలో స్మార్ట్‌ మీటర్స్‌ పెడతారు. జెన్‌కోకు, డిస్కంలకు ఆలస్యంగా చెల్లింపులు కాని, లోడ్‌ షెడ్డింగ్‌ సమస్యలు కాని ఇక ఉండవని కేంద్ర విద్యుత్‌మంత్రి పేర్కొంటున్నారు.

అన్ని రాష్ట్రాలు కూడా రైతులకు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసు కోవచ్చని కూడా వారు రాష్ట్రాలను సూచించారు. కేంద్రం ఎన్నో ప్రయోజనాల్ని ఆశించి ఈ విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రగతి పథంలో దూసుకెళ్లాలంటే ఏ రాష్ట్రమైనా అమలుకు ముందుకు రాకతప్పదు. ఆదిలో చాలా మందికి ఈ విధానం కాస్త గందరగోళం ఏర్పడవచ్చు.

కాలక్రమేణా ఇది అద్భుత సంస్కరణలుగా మిగలవచ్చు. లేదా ముగియవచ్చు. కాకుంటే మొదట్లోనే ఈ బిల్లును తెలంగాణ, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర నూతన సంస్కరణలను తూ.చ తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

దీనిపై రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు పెద్దఎత్తున నిరసనలు, ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు.విద్యుత్‌సంస్కరణల్లో ఆద్యుడు అని చెప్పుకునే చంద్రబాబునాయుడు విద్యుత్‌ మీటర్లను రైతుల ఉరితాడుగా వర్ణించడం శోచనీయం.

వ్యక్తులు ఎల్లవేళలా ఒకే పాలసీతో ఉండాలి. జగన్మోహన్‌ రెడ్డి సంస్కరణవల్ల రాష్ట్రంలోని రైతులకు ఉన్న పళంగా వచ్చిన ముప్పుకాని, నష్టం కాని లేదు. ప్రతినెలా రైతుల అకౌంట్‌లో విద్యుత్‌ ఛార్జీల అమౌంట్‌ వేయడం జరుగు తుంది. వారు చేయాల్సిందల్లా ఆ డబ్బు కరెంటు బిల్లులకు వెంటనే చెల్లించడమే. ఏ జిల్లాలో చూసినా ఇందువల్ల రైతులకు నష్టం జరగదు.

బ్యాంకులో ప్రభుత్వం జమచేసినప్పుడే వాళ్లు తిరిగి చెల్లిస్తారు. మధ్యలో కట్‌ చేయడాలంటూ ఉండవ్ఞ. బాధ్యత మాత్రం ప్రభుత్వం, రైతులపై సమానంగా ఆధారపడి ఉంటుంది. ఇందులో ఎవరు ఆలస్యం చేసినా అది తప్పిదమే అవ్ఞతుంది. ఈ విధానం వల్ల ఉచిత విద్యుత్‌కు 30ఏళ్లవరకు ఢోకాలేదు. ఏ ఒక్క కనెక్షన్‌ తొలగించడం జరగదు అని కూడా జగన్‌ గట్టిగా చెబుతున్నారు.

2015లో కేంద్రం గ్యాస్‌ సబ్సిడీ పథకం ప్రవేశపెట్టినప్పుడూ ఇలాంటి ఆందోళనలు , ఆరోపణలు అన్నిపార్టీల నుండి వచ్చాయి. కానీ ఇది ఈ రోజు ప్రజలతో ప్రయోజనకారిగా ప్రశంసలను అందుకుంటోంది. రైతులు కూడా ఈ కొత్త పథకాన్ని ఆహ్వానించాలి.

రాజకీయ పార్టీలు ఎలాగూ ప్రతి పనిని విమర్శించడం, ప్రజల్ని రెచ్చగొట్టే పనిలో ఉంటాయి. ఇది భారత రాజకీయాల్లో సహజం. ఉచిత విద్యుత్‌ ఇక ఏ ప్రభుత్వాలు వచ్చినా గండికొట్టే పనిచేయరు. మన ఇంటిని మనం చక్కదిద్దుకోవాలి. ఉచిత విద్యుత్‌ నష్టాల వల్ల పారిశ్రామిక రంగానికి ఇస్తున్న కరెంటు చాలా ఎక్కువ ధరలో ఉంది.

అదికూడా దేశానికి అభిలషణీయం కాదు. సంస్కరణల అమలు వల్ల రాష్ట్రాలు జిడిపి నుండి మరో రెండు శాతం అదనంగా బదులు తెచ్చుకొనే సదుపాయం కూడా ఉంటుంది. మోడీనేకాదు, ఆ స్థానంలో మరెవరు ఉన్నా కూడా విద్యుత్‌ రంగాన్ని సంస్కరించాల్సిన తక్షణ ఆవశ్యకత ఉంది. రైతులే కాకుండా అన్ని రకాల ప్రజలకు ఇది అవసరం.

2000 నుండి చాలాఏళ్లు విద్యుత్‌ కోతతో మనం నరకం అనుభవించేవాళ్లం. ఇప్పుడు ఆ సమస్య లేదు. రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి జరగాలి.

ఆ విధంగా అన్ని ప్రభుత్వాలు కృషి చేయాలి. తెలుగుదేశం అయినా, కాంగ్రెస్‌ అయినా, కమ్యూనిస్టుపార్టీ అయినా గుడ్డిగా సంస్కరణల్ని వ్యతి రేకించడం దేశానికి మంచిదికాదు. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రత్యేకదృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది.

-డా.సమ్మెట ఉదయ్ కుమార్‌

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/