దుబాయ్ రాజుకు లండన్ కోర్టు ఆదేశాలు

విడాకులు.. భరణంగా దుబాయ్ రాజు రూ.5,525 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు

దుబాయ్ : దుబాయ్ రాజు మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్దూమ్ (72), ఆయన 6వ భార్య హయా బింట్ అల్ హుస్సేన్ (47) విడాకుల సెటిల్ మెంట్ విషయంలో బ్రిటన్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఏకంగా రూ. 5,525 కోట్ల మనోవర్తిని చెల్లించాలని దుబాయ్ రాజును ఆదేశించింది. ఇందులో రూ. 2,521 కోట్లను ఏకమొత్తంలో చెల్లించాలని తీర్పులో పేర్కొంది. అంతేకాదు రషీద్, హయా సంతానం అల్ జలిలియా (14), జయాద్ (9) లకు చదువు కోసం రూ. 96 కోట్లు, వారి బాధ్యతల కోసం ప్రతి ఏటా రూ. 112 కోట్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇతర అవసరాల కోసం రూ. 2,907 కోట్లను బ్యాంకు గ్యారెంటీగా ఇవ్వాలని ఆదేశించింది. బ్రిటన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకుల్లో ఇదొకటని విశ్లేషకులు అంటున్నారు. హయా 2019లో దుబాయ్ నుంచి లండన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత విడాకుల కోసం అక్కడి హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు తన పిల్లలను అప్పగించాలని కోర్టును కోరారు. అప్పటి నుంచి విచారణ జరుపుతున్న కోర్టు ఇప్పుడు సంచలన తీర్పును వెలువరించింది.

జోర్డాన్ మాజీ రాజు కుమార్తె అయిన రాజ‌కుమారి హ‌యాకు బ్రిట‌న్ పౌర‌స‌త్వం ఉంది. ఆమె 2019లో దుబాయ్ వ‌దిలి లండ‌న్ పారిపోయి.. త‌న పిల్ల‌ల క‌స్ట‌డీ కోసం బ్రిట‌న్ కోర్టుని ఆశ్ర‌యించింది. ఇప్పుడామెకు పిల్ల‌ల క‌స్ట‌డీ ల‌భించ‌డంతోపాటు భ‌ర‌ణం కాకుండా వారి ఖ‌ర్చుల కోసం సంవ‌త్స‌రానికి 11 మిలియ‌న్ పౌండ్లు షేక్ మొహ‌మ్మ‌ద్ చెల్లించాలని లండ‌న్ కోర్టు చెప్పింది. రాజ‌కుమారి హ‌యా త‌న సెక్యూరిటీ సిబ్బందితో వివాహేత‌ర సంబంధం క‌లిగి ఉంద‌ని అనుమానంతో ఆమె భ‌ర్త దుబాయ్ రాజు షేక్ మొహమ్మ‌ద్ ఆమెను అర‌బీలో క‌విత‌ల రూపంలో బెదిరించేవాడ‌ని.. అందుకే దేశం వ‌దిలి పారిపోవాల్సి వ‌చ్చింద‌ని కోర్టుకు చెప్పింది. అంత‌కుముందు రాయ‌ల్ సెక్యూరిటీ సిబ్బందిలో కొంద‌రు త‌నకు వివాహేత‌ర సంబంధం ఉన్న‌ట్లు రాజుకు చెప్ప‌కుండా ఉండడానికి త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బులు, పిల్ల‌ల బ్యాంకు ఖాతాలో ఉన్న డ‌బ్బు సైతం ఇచ్చాన‌ని చెప్పింది.

త‌న ఫోన్‌ని హ్యాక్ చేసి త‌న ప్రైవేట్ కాల్స్‌ని షేక్ మొహ‌మ్మ‌ద్ వినేవాడ‌ని రాజ‌కుమారి హ‌యా చెప్పింది. దుబాయ్ రాజు షేక్ మొహ‌మ్మద్ లండ‌న్ కోర్టు తీర్పును అమ‌లుప‌ర‌చ‌క‌పోతే దౌత్య ప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/