కేసీఆర్ ఫామ్ హౌస్ లో యువకుడు దుర్మరణం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో 19 ఏళ్ల యువకుడు మృతి చెందడం సంచలనంగా మారింది. కూలీ పనుల కోసం వచ్చిన ఆ యువకుడు ప్రమాదావశావత్తూ ఫామ్‌హౌస్‌లోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో కేసీఆర్ కు ఫామ్‌హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ విశ్రాంతి తీసుకోవడానికి తరచూ ఈ ఫామ్‌హౌస్‌కు వస్తుంటారు. అతిపెద్ద ఫామ్‌హౌస్ కావడం వల్ల రోజువారీ వ్యవసాయ పనుల కోసం చుట్టు పక్కల గ్రామాల నుంచి స్థానికులు వెళ్తుంటారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వ్యవసాయ బావి చుట్టూ ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు విస్తృతంగా పెరిగాయి. రెండు రోజులుగా వ్యవసాయ బావి వద్ద ముళ్ల పొదలను తొలగించే పనులు సాగుతున్నాయి.

ఎర్రవల్లి సమీపంలోని వరద రాజాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు (19 ఏళ్లు) బావి వద్ద ముళ్ల పొదలను తొలగిస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. దీనితో అతడు అక్కడికక్కడే మరణించాడని అక్కడి వారు చెపుతున్నారు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటాడని భావించిన తమ కుమారుడు ఊహించని విధంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. తమకు న్యాయం చేయాలంటూ వారు ఫామ్‌హౌస్ వద్ద ఆందోళన చేపట్టారు. అన్ని విధాలుగా ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకుంటామని ఫామ్‌హౌస్ అధికారులు స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.