యాత్రలో అరక పట్టిన నారా లోకేష్

యువగళం యాత్రలో నారా లోకేష్ పొలంలో అరక దున్ని అందర్నీ ఆకర్షించారు. గత 15 రోజులుగా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క పోలీసులు అడ్డుకుంటునప్పటికీ , ఎక్కడ తగ్గకుండా ప్రజల కష్టాలను తెలుసుకుంటూ , ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతూ యాత్ర కొనసాగిస్తున్నారు. నేడు జీడీ నెల్లూరు నియోజకవర్గం రేణుకాపురం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. ఎగువ కమ్మ కండ్రికలో లోకేష్ ఒక రైతు పొలంలోకి వెళ్లి అరకదున్నతూ ఆ రైతు కష్టాలు అడిగి తెలుసుకున్నారు.

ఇక ఈరోజు పోలీసులు పాదయాత్రలో మైక్ కు అనుమతి ఇవ్వలేదు. పద్మాపురంలో స్టూలుపై నిల్చొని మైక్ లేకుండానే లోకేశ్ ప్రజలనుద్దేశించి ప్రసంగించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా లోకేశ్ పోలీసుల చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. “జగన్ ఓ పిరికిపంద.. పోలీసులతో నా పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారు… నన్ను ఎంతగా ఆపాలని చూస్తే అంతకు రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళ్తా… ప్రజాదరణతో సాగుతున్న యువగళాన్ని ఎవరూ ఆపలేరు” అని స్పష్టంచేశారు.

అలాగే అంబేద్కర్ విదేశీ విద్యకు పేరు మార్చడమే కాదు… ఆ పథకాన్నే జగన్ రెడ్డి ఎత్తేశారని మండిపడ్డారు. దళితులు అభివృద్ధి చెందేందుకే విదేశీ విద్య ప్రవేశపెట్టాం. అధికారంలోకి రాగానే మళ్లీ విదేశీ విద్య తీసుకొస్తాం… అంబేద్కర్ పేరు కొనసాగిస్తాం అంటూ ఎస్సీలకు లోకేష్ భరోసా ఇచ్చారు.