హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు చేరుకున్నారు. శనివారం సర్దార్‌ వల్లభ్ భాయ్‌ పటేల్‌ పోలీస్‌ అకాడమీలో జరగనున్న ఐపీఎస్ ఆఫీసర్ల పాసింగ్ ఔట్ పరేడ్‭కు ముఖ్య అతిధిగా అమిత్ షా పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ చేరుకున్న అమిత్ షా కు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి సహా పలువురు బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి ఆయన నేరుగా నోవాటెల్ కు వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.

రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని నేషనల్‌ పోలీస్ అకాడమీలో మొత్తం 195 మంది ఐపీఎస్‌ల ట్రైనింగ్‌ పూర్తైంది. ట్రైనింగ్ పూర్తి చేసిన వారిలో 129 మంది పురుషులు, 37 మంది మహిళలు సహా 29 మంది రాయల్‌ భూటాన్, నేపాల్‌కు చెందిన వారు ఉన్నారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన ప్రొబేషనరీ ఐపీఎస్‌లకు అమిత్‌ షా ట్రోఫీలను అందజేయనున్నారు.