దివ్యాంగురాలిపై వైసీపీ నేత లైంగిక దాడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని..వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు తెగపడుతుంటే, తామేమి తక్కువ తినలేదంటూ వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయంటూ కొద్దిరోజులుగా విమర్శిస్తూ వస్తోన్న నారా లోకేష్- ఇదే అంశంపై అధికార పార్టీ నేతలపై ఘాటు ఆరోపణలను సంధించారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ‘కాటికి కాలుచాపే వయసులో అన్నీ చేయించుకోవాలనే ఆత్రపడే కాంబాబు, అరగంట పనోడు అవంతిని ఆదర్శంగా తీసున్నాడేమో?’ అని నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

విశాఖ వైసీపీ నాయకుడు వెంకటరావు దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని.. సభ్యసమాజం తలదించుకునేలా దివ్యాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణమని మండిపడ్డారు. దివ్యాంగురాలికి సాయం అందించాల్సిన చేతులే చిదిమేయడం ఘోరమన్నారు. వైసీపీ రేపిస్టుల తరపున పోలీసులు వకాల్తా పుచ్చుకుని.. చచ్చు మాటలు పుచ్చు వాదనలతో ప్రెస్ మీట్ పెట్టొద్దని అన్నారు. మీకు చేతనైతే, మీరు నిజమైన పోలీసులైతే నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయండి అంటూ లోకేష్ హితవుపలికారు.

విశాఖ సీలేరులో దివ్యాంగురాలిపై వైసీపీ నేత వెంకట్రావు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా విషయం బయటకు చెబితే చంపేస్తానని హెచ్చరించారు. దీనిపై బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకట్రావు.. ప్రస్తుతం వైసీపీ సీలేరు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు వెంకట్రావు ను అరెస్ట్ చేసారు.