తండ్రి అరెస్ట్..విజయవాడకు బయల్దేరిన లోకేశ్

నా తండ్రిని చూసేందుకు కూడా నాకు అనుమతి కావాలా? అని మండిపడ్డ లోకేశ్

Lokesh left for Vijayawada

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ తో టిడిపి శ్రేణులు రగిలిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. మరోవైపు, తన తండ్రిని అరెస్ట్ చేసిన వెంటనే టిడిపి యువనేత నారా లోకేశ్ తన పాదయాత్ర క్యాంప్ సైట్ నుంచి విజయవాడకు బయల్దేరారు. అయితే రాజోలు సీఐ గోవిందరాజు లోకేశ్ ను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐతో ఆయన వాగ్వాదానికి దిగారు. తన తండ్రిని చూడ్డానికి కూడా తనకు అనుమతి కావాలా? అని ప్రశ్నించారు. నోటీస్ లేకుండా తనను ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్తను చూసేందుకు వచ్చే తన తల్లిని, మామను చూసేందుకు వచ్చే తన భార్యను అడ్డుకోగలరా? అని ప్రశ్నించారు. రెస్ట్ తీసుకోవాలని చెప్పిన సీఐపై ఆయన మండిపడ్డారు. తండ్రిని చూసేందుకు వెళ్తుంటే రెస్ట్ తీసుకోమంటావా? నీకు సైకో జగన్ చెప్పాడా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, లోకేశ్ కు మద్దతుగా అక్కడ పెద్ద సంఖ్యలో టిడిపి నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. తండ్రిని చూసేందుకు కొడుక్కి పోలీసుల అనుమతి కావాలా? అనే ప్లకార్డును పట్టుకుని లోకేశ్ నిరసన వ్యక్తం చేశారు.