కామారెడ్డి రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన పోచారం

ఆదివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హసన్ పల్లి గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఒకే కుటుంబంలో 9 మంది మరణించడం తో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ గ్రామానికి చేరుకొని మృతులకు నివాళులర్పించారు. ఆయా కుటుంబాలను పరామర్శించారు. రోడ్డు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మోదీ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే తెలంగాణ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్రం ఎంతయితే పరిహారం ప్రకటించిందో… తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే పరిహారం ప్రకటించడం గమనార్హం.

ఎల్లారెడ్డి పోలీసు స్టేషన్‌ పరిధిలోని హసన్‌పల్లి గేటు వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 25 మంది ప్రయాణికులతో వస్తున్న టాటా ఏస్‌ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు మరణించగా ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరో ముగ్గురు తనువు చాలించారు. చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు.. ఇక మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో 14 మందికి కూడా గాయాల్వడంతో వారికి కూడా చికిత్స అందిస్తున్నారు.