దేశంలో 96.88 కోట్ల ఓటర్లు.. లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్న ఈసీ

lok-sabha-election-2024-date-ec-announce

న్యూఢిల్లీః అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రానే వచ్చింది. భారత ముఖ్య ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్‌లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. షెడ్యూల్‌ వెల్లడితో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.

సాధారణ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా, ఈ సాధారణ ఎన్నికల్లో మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. అందులో కోటీ 82 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 12 లక్షల పోలింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 55 లక్షల ఈవీఎంలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1.5 కోట్ల మంది ఉద్యోగులు పాలుపంచుకోనున్నారని చెప్పారు.