అద్వాణీకి భారతరత్న..ఈ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందిః ప్రధాని మోడీ

అద్వాణీతో మాట్లాడి, అభినందనలు తెలియజేశానన్న మోడీ

LK Advani To Be Honoured With Bharat Ratna, Announces PM Modi

న్యూ ఢిల్లీః బిజెపి అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు అద్వాణీని భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘ఎల్కే అద్వాణీ గారికి భారతరత్న పురస్కారం ఇవ్వబడుతోందనే విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో నేను మాట్లాడాడు. ఈ పురస్కారాన్ని పొందబోతున్నందుకు అభినందనలు తెలియజేశాను. సమకాలీన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అద్వాణీ ఒకరు. మన దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు, కృషి చిరస్మరణీయమైనవి. అట్టడుగు స్థాయిలో పని చేయడం దగ్గర నుంచి దేశానికి ఉప ప్రధానమంత్రిగా చేయడం వరకు ఆయన జీవితం ఎంతో ఉన్నతమైనది. దేశ హోంమంత్రిగా, సమాచారశాఖ మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎంతో ఆదర్శప్రాయమైనవి, ఎంతో ఆలోచనప్రాయమైనవి’ అని మోడీ ట్వీట్ చేశారు. అద్వానీతో దిగిన ఫోటోలను కూడా మోడీ షేర్ చేశారు. అద్వాణీకి భారత రత్న పురస్కారం దక్కడంపై పార్టీలకు అతీతంగా హర్షం వ్యక్తమవుతోంది.