మందు బాబులకు షాకింగ్ న్యూస్..తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం ధరలు

మందు బాబులకు షాక్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. మద్యం ధరలను భారీగా పెంచింది. ఒక్కో బీరుపై రూ.20 పెంచిన ప్రభుత్వం…బ్రాండ్‌తో సంబంధం లేకుండా ఒక్కో క్వార్ట‌ర్‌పై రూ.20 పెంచింది. అలాగే ప్ర‌తి హాఫ్ బాటిల్ పై రూ.40, ఫుల్ బాటిల్ మ‌ద్యం ధ‌ర‌ను ఏకంగా రూ.80 పెంచింది. ఈ మేర‌కు బుధ‌వారం రాత్రి తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు రేపటి నుంచే (మే 19) అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

లిక్కర్ షాపుల్లో నేటి అమ్మకాలు పూర్తవగానే అబ్కారీ శాఖ అధికారులు మద్యం నిల్వలను సీజ్ చేసారు. రేపటి నుంచి పెరిగిన ధరల ప్రకారం మద్యం అమ్మకాలు సాగించేలా చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణలో మద్యం ధరలు పెరిగినా.. ఏపీతో పోల్చితే ఇప్పటికే తక్కువగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వేసవి నేపథ్యంలో బీర్ల అమ్మకాలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో బీర్ల అమ్మకాలు 90 శాతం ఎక్కువగా నమోదయ్యాయని అబ్కారీ శాఖ తెలిపింది. మార్చి నుంచి ఇప్పటిదాకా రూ.6,702 కోట్ల బీర్లు అమ్ముడయ్యాయి.

బీర్ల విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో రంగారెడ్డిలో 2.38 కోట్ల లీటర్ల బీర్ల విక్రయం జరిగింది. 1.15 కోట్ల లీటర్ల విక్రయాలతో వరంగల్‌ రెండో స్థానంలో నిలిచింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుండటంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయని అధికారులు చెబుతున్నారు.