శ్రీశైలంలో మూడు గేట్ల ఎత్తివేత

నిండనున్న నాగార్జునసాగర్‌

srisailam dam

శ్రీశైలం: శ్రీశైలంలో జలాశయం నిండు కుండలా మారడంతో మూడు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. గేట్లు తెరిచిన వెంటనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ.. పాలధారలా ఉప్పొంగుతూ..నాగార్జునసాగర్‌కు పరుగులు తీసింది. రిజర్వాయర్ నుంచి అన్ని ఎత్తిపోతల, కుడి, ఎడమ కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్న అధికారులు, వస్తున్న ప్రవాహం పెరగడంతో మూడు గేట్లను తెరిచి, దాదాపు 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా నాగార్జున సాగర్ కు చేరనుండటంతో, ఇదే ప్రవాహం కొనసాగితే, రెండు నుంచి మూడు రోజుల్లోనే సాగర్ కూడా నిండిపోతుందని అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో మరో మూడు రోజుల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండనున్నాయి. పులిచింతలకు దిగువన నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వైరా, కట్టలేరు, మున్నేరుల్లో వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద తగ్గింది. బుధవారం ఆరు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 68,522 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు వదలగా మిగులుగా ఉన్న 48,754 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/