మే 13న వేతనంతో కూడిన సెలవు – ఈసీఓ వికాస్ రాజ్

తెలంగాణలో ఉన్న ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్.. మే 13న జీతంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ.. ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నామినేషన్ల పర్వం ముగిసింది. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్లు విత్ డ్రా చేసుకునేందుకు ఈనెల 29 వరకు తుది గడువు విధించారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు, 1 అసెంబ్లీ స్థానానికి, ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఈసీఓ వికాస్ రాజ్ కీలక ప్రకటన చేసారు. మే 13న వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ.. ఈసీఓ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎవరైనా ఇతర రాష్ట్రాలకు అంటే.. మహారాష్ట్ర, కర్ణాటక, ఛతీస్ గడ్ కి చెందిన ఉద్యోగులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ల రాష్ట్రాలకు వెళ్లినట్టయితే.. వారికి వేతనం ఇవ్వాల్సిందిగా ఆయన జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని వల్ల.. ఉద్యోగులంతా పోలింగ్ ప్రక్రియలో పాల్గొని ఓటును హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు.. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఆరోజును పెయిడ్ హాలిడేగా ప్రకటించాలని ప్రభుత్వం సూచించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. ఇదే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే.