రాజకీయంగా ఎదురుకోవాలి కానీ స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకోవద్దు – మంత్రి హరీష్ రావు

ఎవరైనా సరే రాజకీయంగా ఎదురుకోవాలి కానీ స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకోవద్దు అని అన్నారు మంత్రి హరీష్ రావు. పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారం ఫై మీడియా తో హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ వెనక బీజేపీ కుట్ర ఉందని, ఆ కుట్ర వెనక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తమ రాజకీయ స్వార్థం కోసం, బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లడం కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలకు చదువు విలువ తెలియదని, రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా ఆ పార్టీలో ఫేక్ సర్టిఫికెట్ల నేతలే ఎక్కువని విమర్శించారు.

రాజకీయంగా కొట్లాడటం చేతగాక దిక్కుమాలిన, దిగజారుడు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని హరీశ్‌ రావు విమర్శించారు. పట్టపగలు బండి సంజయ్, బీజేపీ పార్టీ దొరికిపోయాయని హరీశ్‌ రావు అన్నారు. స్పష్టంగా దొరికిపోయినప్పటికీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పిల్లల జీవితాలను తాకట్టు పెట్టి రాజకీయాలు అవసరమా అని బీజేపీ నేతలపై మండిపడ్డారు. ఏ ప్రభుత్వంపైనా భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందని.. కేంద్రంలో బీజేపీ ఉందన్నారు. మనం భవిష్యత్తు తరాల కోసం పనిచేయాలి కానీ.. రాజకీయాల కోసం భవిష్యత్తు తరాల జీవితాలతో ఆడుకోవడం సమంజసం కాదన్నారు. మధ్యాహ్నం ఏమో పేపర్‌ లీకైందని బీజేపీ నాయకులు ధర్నా చేసిన్రు.. సాయంత్రం ఏమో పేపర్‌ లీకేజీకి బాధ్యులై అరెస్టయిన వారిని విడుదల చేయాలని అదే బీజేపీ చేసిందని అన్నారు. దీన్ని బట్టి అరెస్టు అయ్యింది పక్కా బీజేపీ దొంగ.. బీజేపీ నాయకుడు.. బీజేపీ కార్యకర్త అని అర్థమవుతోందని అన్నారు.

తాండూరు తెలుగు పేపర్, వరంగల్ లో హిందీ పేపర్ లీక్ కు పాల్పడింది బీజేపీ కార్యకర్తలేనని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ రెండు ఘటనలలో బండి సంజయ్ కుట్ర దాగుందని ఆరోపించారు. తాండూరులో పశ్నపత్రం వాట్సాప్ లో లీక్ చేసిన ఉపాధ్యాయుడు బీజేపీ ఉపాధ్యాయ సంఘం నేత అని మంత్రి చెప్పారు. అదేవిధంగా వరంగల్ లో హిందీ పేపర్ లీక్ చేయడానికి ప్రయత్నించిన ప్రశాంత్ కరుడుగట్టిన బీజేపీ కార్యకర్త, బండి సంజయ్ అనుంగు అనుచరుడు అని చెప్పారు. బీజేపీ నేతలతో ప్రశాంత్ దిగిన ఫొటోలను, పోస్టర్లను మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా మీడియా ముందు ప్రదర్శించారు.