సైన్యాన్ని రంగంలోకి దింపుతా..ట్రంప్‌ హెచ్చరిక

అమెరికాలో నిరసనలపై ట్రంప్‌ వ్యాఖ్యాలు

Donald Trump
Donald Trump

వాషింగ్టన్‌: అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే న‌ల్ల‌జాతీయుడు మిన్నియాపోలీస్ పోలీసుల చెర‌లో చ‌నిపోవ‌డంతో.. అమెరికా అంత‌టా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర‌స‌న‌లపై అధ్య‌క్షుడు ట్రంప్ స్పందించారు. సోమ‌వారం సాయంత్రం వైట్‌హౌజ్ రోజ్ గార్డెన్ వ‌ద్ద ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..ఆందోళ‌న‌కారుల్ని త‌రిమేందుకు సైన్యాన్ని రంగంలోకి దింప‌నున్న‌ట్లు ఆయ‌న హెచ్చ‌రించారు. వివిధ న‌గ‌రాలు, రాష్ట్రాలు త‌మ ప్ర‌జ‌ల్ని కాపాడ‌లేక‌పోతే, అప్పుడు ఆర్మీని రంగంలోకి దింప‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. జార్జ్ ఫ్లాయిడ్ మృతి ప‌ట్ల ప్ర‌తి అమెరిక‌న్ ప‌శ్చాతాపం వ్య‌క్తం చేస్తున్నార‌ని, కానీ కొంద‌రి ఆగ్ర‌హానికి ఎవ‌రూ బ‌లికావ‌ద్దు అని అన్నారు. దేశ‌రాజ‌ధానిలో జ‌రుగుతున్న లూటీలు, హింస‌.. అవ‌మాన‌క‌ర‌మ‌ని తెలిపారు.

వాషింగ్ట‌న్ డీసీకి వేలాది మంది సైనికులను, పోలీసు అధికారుల్ని మోహ‌రిస్తున్న‌ట్లు ట్రంప్ చెప్పారు. లూటీలు, విధ్వంసం, దాడులు ఆపేందుకు, ప్రాప‌ర్టీల‌ను ర‌క్షించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. హింస‌కు పాల్ప‌డుతున్న వారికి క‌ఠిన శిక్ష‌లు ఉంటాయ‌న్న సందేశాన్ని ఆయ‌న వినిపించారు. కాగా అల్లర్లు అదపు చేయడంలో గవర్నర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే నేషనల్‌ గార్డ్స్‌ను రాష్ట్రాల్లోకి అనుమతించకపోతే సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి వస్తుందని ట్రంప్‌ హెచ్చరించారు. దేశ శాంతి, భద్రతలను కాపాడడం తన ప్రథమ కర్తవ్యం అన్నారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటానని వ్యాఖ్యానించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/