సాయితేజ అంత్యక్రియలు పూర్తి..

తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం పూర్తీ అయ్యాయి. సాయితేజ స్వగ్రామం ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. కడసారి చూసిన సాయితేజ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు.

భరతమాత ముద్దుబిడ్డను కడసారి కళ్లారా వీక్షించేందుకు.. జనం వేలాదిగా తరలివచ్చారు. సాయితేజ అమర్​ రహే, జై జవాన్ అంటూ నినదించారు. అంతకుముందు వీరజవాన్, లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయాన్ని ఆయన ఎగువరేగడికి ర్యాలీగా తీసుకెళ్లారు. దారిపొడవునా సాయితేజకు పుష్పాంజలి ఘటించారు స్థానికులు. అంబులెన్స్‌పై పూలుజల్లుతూ.. దేశభక్తి నినాదాలిస్తూ నివాళులు అర్పించారు. దేశ రక్షణే ధ్యేయమంటూ బయలు దేరిన.. సాయితేజ ఇక లేడనీ.. అమరుడయ్యాడనే వార్త తెలియగానే.. ఆ కుటుంబం శోకసంద్రమైంది. జనవరిలో వస్తానని చెప్పి… హెలికాప్టర్ ఘటనలో అందరినీ విడిచి వెళ్లిపోయాడు సాయితేజ.

తమిళనాడులోని కూనూర్ లో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు సహా 11 మంది ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతాధికారిగా ఉన్న లాన్స్ నాయక్ కూడా ఈ ఘటనలోనే అమరుడయ్యారు.