18న దేశవ్యాప్త రైల్‌రోకో.. సంయుక్త కిసాన్ మోర్చా

లఖింపూర్ ఖేరి ఘటనకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ఈ నెల 18న దేశవ్యాప్త రైల్ రోకోకు పిలుపునిచ్చింది. లఖింపూర్ ఖేరీ ఘటనకు కారణమైన కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించడంతోపాటు, రైతులను వాహనంతో తొక్కించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. లేకుంటే ఈ నెల 18న దేశవ్యాప్తంగా రైల్ రోకో చేపడతామని కేంద్రాన్ని హెచ్చరించింది.

అలాగే, ఈ నెల 12న రైతు యోధుల దినోత్సవం (షహీద్ కిసాన్ దివస్) నిర్వహిస్తామని పేర్కొంది. రైతులు అమరులైన తికోనియాలో సంస్మరణ సభ నిర్వహిస్తామని తెలిపింది. రైతు సంఘాలు, రైతులు ఆ రోజున సంస్మరణ సభలు నిర్వహించాలని, అన్ని మతాల వారు ప్రార్థనలు నిర్వహించాలని, అమరులు శ్రద్ధాంజలి ఘటించాలని విజ్ఞప్తి చేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/