రేపు ఏపీ ఇంటర్ ఫ‌లితాలు విడుద‌ల‌..

ఏపీ ఇంటర్ ఫలితాలను రేపు బుధువారం మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లో విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల‌ చేయ‌నున్నారు. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్‌ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఈసారి మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగింది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్‌ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్త ప‌డ్డారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు.

ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్‌ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్‌ పరీక్షలను పర్యవేక్షించారు. గతం వారం పది రోజులుగా ఇంటర్ ఫలితాలపై ఊహానగాలు జోరుగా వినిపించాయి. తొలుత ఈ నెల 15వ తేదీ నాడే ఇంటర్ ఫలితాలు విడుదల అవుతాయని జోరుగా ప్రచారం సాగింది. అయితే.. ఇంటర్ బోర్డ్ ఆ రోజు ఫలితాలను విడుదల చేయడం లేదని స్పష్టం చేయడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. ఆ సమయంలో మరో వారంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తామని బోర్డు వెల్లడించింది. ఈ మేరకు రేపు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటన విడుదల చేసింది.