ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్రకు స్వల్ప అంతరాయం

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్రకు స్వల్ప అంతరాయం

ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్రకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. టెలిఫోన్ భవన్ దగ్గర చెట్లు అడ్డుగా ఉండడం తో వాటిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో అంతరాయం ఏర్పడింది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి సాగరాన్ని చేరనున్నాడు. పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్ర ఉదయం 9 గంటలకు మొదలైంది. ఖైరాతాబాద్ నుంచి టెలిఫోన్‌ భవన్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌పైకి సాగనుంది. మొత్తం 2.5 కిలోమీటర్లు సాగుతుంది. ట్యాంక్‌ బండ్‌పై 4వ నంబర్‌ క్రేన్‌ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. కొవిడ్ ఆంక్షలు ఉన్నప్పటికీ ఖైరతాబాద్ గణనాథుడిని సాగనంపేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల లోపు గణనాథుడిని నిమజ్జనం చేసే అవకాశం ఉంది.

ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనోత్సవానికి ఈ ఏడాది టోలిచౌకి సాలార్‌జంగ్‌ కాలనీకి చెందిన సూపర్‌ క్రేన్స్‌ సంస్థకు చెందిన క్రేన్‌ను వినియోగిస్తున్నారు. 200 టన్నుల బరువును అవలీలగా పైకి ఎత్తే కెపాసిటీ దీని సొంతం. హైడ్రాలిక్‌ టెలిస్కోపిక్‌ టెక్నాలజీతో కూడిన ఈ క్రేన్‌ డ్రైవర్‌గా ఔదేశ్‌ కుమార్‌ వ్యవహరిస్తున్నారు.