ఈట‌ల కోసం కాంగ్రెస్ డ‌మ్మీ అభ్య‌ర్థి: మంత్రి కేటీఆర్

ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఉన్నట్లే కనబడటం లేదు


హైదరాబాద్: హుజూరాబాద్ లో టీఆర్ఎస్ క‌చ్చితంగా గెలుస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ..బీజేపీ నేత‌ ఈట‌ల రాజేంద‌ర్ కోస‌మే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ డ‌మ్మీ అభ్య‌ర్థిని నిల‌బెట్టింద‌ని చెప్పుకొచ్చారు. ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఉన్నట్లే కనబడటం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆయ‌న ఆరోపించారు. ఈటల రాజేందర్‌కు టీఆర్‌ఎస్ ఎక్క‌డ‌ అన్యాయం చేసింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటి నుంచి ఈటల రాజేంద‌ర్ పదవుల్లో కొన‌సాగార‌ని చెప్పారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ద‌ళిత బంధును ప్ర‌వేశపెట్టింది ఈటల రాజీనామా చేసినందుకు కాద‌ని, ఈటల మంత్రి వ‌ర్గంలో ఉన్న స‌మ‌యంలోనే దళిత బంధుకు శ్రీకారం చుట్టామ‌ని తెలిపారు. తాము ఉప ఎన్నిక‌లో జానారెడ్డినే ఓడించామ‌ని, ఈట‌ల రాజేందర్ అంత‌కంటే పెద్ద నాయ‌కుడా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. బీజేపీ బుర‌ద‌ను ఈట‌ల అంటించుకున్నార‌ని ఆయ‌న దెప్పిపొడిచారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/