దమ్ముంటే సీఎం కేసీఆర్ ఫై పోటీ చెయ్ ..రేవంత్ కు కేటీఆర్ సవాల్

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు పెరిగిపోతున్నాయి. విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడిని మరింత పెంచుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఫై మంత్రి కేటీఆర్ విరుచుకపడుతున్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో.. కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి, మాచారెడ్డి, రామారెడ్డి మండలాలవారీగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల ఎన్నికల సన్నాహాక సమావేశాలు, సభలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘రేవంత్‌రెడ్డీ నీకు దమ్ముంటే కామారెడ్డికి రా.. సీఎం కేసీఆర్‌పై పోటీ చెయ్‌’’ అని మంత్రి కేటీఆర్‌ సవాలు చేశారు. రేవంత్‌ను చిత్తుచిత్తుగా ఓడించేందుకు కామారెడ్డి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే గెలవని రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో గెలుస్తారా.. అని ఎద్దేవా చేశారు. రేవంత్‌ కామారెడ్డిలో పోటీ చేస్తే ఆయనకు డిపాజిట్లు కూడా రావని, షబ్బీర్‌ అలీ పోటీ చేస్తేనే కాంగ్రెస్‌ పార్టీకి కాస్తోకూస్తో ఓట్లు పడతాయని చెప్పారు. కానీ, షబ్బీర్‌ అలీ కేసీఆర్‌పై పోటీ చేసేందుకు భయపడుతున్నారని, కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేయలేక ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, కేసీఆర్‌పై పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలును బలివ్వడమేనని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.