కేటీఆర్ కు బుడ్డోడి ట్వీట్..క్షణాల్లో రంగంలోకి అధికారులు

మంత్రి కేటీఆర్..సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రభుత్వ హామీలే కాదు ప్రజల నుండి వచ్చే సమస్యల పట్ల కూడా స్పందిస్తుంటారు. ఆపద లో ఉన్నాం సార్..ఆదుకోండి అని అర్ధరాత్రి ట్వీట్ చేసిన సరే..వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసాం. తాజాగా ఓ బుడ్డోడి చేసిన ట్వీట్ కు స్పందించి మరోసారి వార్తల్లో నిలిచారు.

హైద‌రాబాద్‌లోని గోల్డెన్ సిటీ కాల‌నీ(పిల్ల‌ర్ నంబ‌ర్ 248) లో గ‌త ఐదేండ్ల నుంచి తాగునీటి స‌మ‌స్య ఉంద‌ని చిన్నారి ఉమ‌ర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. డ్రింకింగ్ వాట‌ర్ పైపులైన్ కోసం ఎదురుచూస్తున్నామ‌ని తెలిపాడు. అన్ని ట్యాక్సులు చెల్లిస్తున్నామ‌ని చెప్పాడు. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. గోల్డెన్ సిటీ కాల‌నీకి వెళ్లి స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని జ‌ల మండ‌లి ఎండీ దాన కిశోర్‌కు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి కేటీఆర్ ఆదేశాల‌తో జ‌ల మండలి ఎండీ దాన కిశోర్ గోడ్డెన్ సిటీ కాల‌నీకి వెళ్లారు. చిన్నారి ఉమ‌ర్‌ను దాన కిశోర్ క‌లిశారు. అనంత‌రం కేటీఆర్‌కు ట్వీట్ చేశారు జ‌ల‌మండ‌లి ఎండీ. గోల్డెన్ సిటీ కాల‌నీకి వెళ్లి చిన్నారి ఉమ‌ర్‌ను క‌లిశాం. ఈ ఏరియాకు వాట‌ర్ పైపులైన్ కోసం రూ. 2.85 కోట్లు నిధులు మంజూర‌య్యాయ‌ని తెలిపారు. వ‌ర్షాకాలం కార‌ణంగా మొన్న‌టి వ‌ర‌కు ప‌నులు చేప‌ట్ట‌లేదు. త్వ‌ర‌లోనే ప‌నులు ప్రారంభిస్తాం. వాట‌ర్‌లైన్‌కు ఉమ‌ర్ నివాసం 3.94 కిలోమీర్ల దూరంలో ఉంద‌ని, అందుకు గానూ రూ. 94 ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని తెలిపారు. రెండు వారాల్లో ఆ ఏరియాకు తాగునీటి స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని జ‌లమండ‌లి ఎండీ దాన కిశోర్ స్ప‌ష్టం చేశారు.