కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్‌

రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్​లో ఏర్పాటు చేయనున్న ఫాక్స్​కాన్​ కంపెనీకి సోమవారం ఐటీ మంత్రి కేటీఆర్​ భూమి పూజ చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సుమారు రూ.1,656 (200 మిలియన్‌ డాలర్లు) కోట్లకుపైగా పెట్టుబడితో ఫాక్స్‌కాన్‌ ఇక్కడ తయారీ కేంద్రానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యాంగ్‌లియూతో కలిసి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్​లో కేటీఆర్​ మాట్లాడుతూ.. ఫాక్స్​కాన్​ పెట్టుబడి పెట్టడానికి తెలంగాణను ఎంచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ర్ట ప్రజలకు చిరకాలం గుర్తిండిపోయే రోజు అని ఆయన అన్నారు. 9 ఏళ్లుగా తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని అన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. భారత్​లో క్రియేట్​ అయ్యే ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలోనే క్రియేట్ అవుతోందని తెలిపారు. రాష్ట్రావిర్భావం తరువాత కొత్తగా 23 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, సీఎం కేసీఆర్​ నాయకత్వంలో రాష్ర్టం పురోగాభివృద్ధి సాధిస్తోందన్నారు.