నేడు ‘అమరరాజా గిగా కారిడార్‌’ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్రంలో ఐటీ టవర్‌ ప్రారంభం, అమరరాజా గిగా కారిడార్‌కు శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

లిథియమ్‌ సెల్‌- బ్యాటరీ ప్యాక్‌ యూనిట్‌ నిర్మాణాన్ని ఏడాదిన్నర వ్యవధిలో పూర్తి చేసి, ఉత్పత్తి చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమరరాజా గ్రూపు ప్రతినిధులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన (ఎస్పీవీ) అమరరాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ కింద ఈ యూనిట్‌ను కార్యరూపంలోకి తీసుకువస్తున్నారు. దాదాపు 16 గిగావాట్ల లిథియమ్‌ ఆయాన్‌ బ్యాటరీ ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నెలకొల్పనున్నారు. దశల వారీగా ఈ కారిడార్‌పై వచ్చే పదేళ్లలో రూ.9,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ఇంతకు ముందే అమరరాజా బ్యాటరీస్‌ యాజమాన్యం వెల్లడించింది. ఈ యూనిట్‌కు సంబంధించి కొంతకాలం క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అమరరాజా బ్యాటరీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఎక్సైజ్‌, పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, కలెక్టర్‌ జి.రవినాయక్‌ ఏర్పాట్లు దగ్గ రుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో అడుగడుగునా ఫ్లెక్సీలు, కటౌట్లు, జెండాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మంత్రుల పర్యటన కొనసాగనుంది. ఎస్పీ కె.నరసింహ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. దివిటిపల్లి వద్ద పరిశ్రమల ఏర్పాటే లక్ష్యంగా 370 ఎకరాల్లో ఐటీ, ఎనర్జీ పార్క్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ నాలుగు ఎకరాల్లో టీఎ స్‌ఐఐసీ రూ.40 కోట్లతో ఐదంతస్తుల ఐటీ టవర్‌ నిర్మించింది. అత్యాధునిక సదు పాయాలతో నిర్మించిన ఈ టవర్‌ను ఐటీ మంత్రి కేటీఆర్‌, ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం ప్రారంభించనున్నారు. ఇక్కడ త్వరలోనే ఆరు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నరసింహులు, తదితర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.