ఎమ్మెల్యేల కు , మంత్రులకు కేటీఆర్ కీలక ఆదేశాలు

నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను తీవ్రంగా నష్టపరిచాయి. భారీ వర్షాలకు తోడు ఈదురు గాలులు, వడగళ్లు పడుతుండటంతో రైతన్నలు గగ్గోలుపెడుతున్నారు. అకాల వర్షాలు, వడగళ్లకు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సమాచారం. ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలకు ఊహించిన విధంగా కురుస్తున్న అకాల వర్షాలు కన్నీళ్లను మిగులుస్తున్నాయి. వర్షాలకు వడగళ్ల వాన తోడవ్వడంతో యాసంగి పంటలకు భారీస్థాయిలో నష్టం వాటిల్లింది. ఉగాది పండుగకు ముందు అన్నదాతలు ఊహించని కష్టాల్లో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వానల వల్ల చేతికి రావాల్సిన మొక్కజొన్న పంట, వరి, శనగ తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఈ క్రమంలో మంత్రి కేటీఆర్..ఎమ్మెల్యేలకు , మంత్రులకు కీలక ఆదేశాలు జారీచేశారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రాలను రైతులను వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులతో పరిశీలించి, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న రైతన్నలకు భరోసానిస్తూ.. విశ్వాసం కల్పించేలా వారితో మమేకం కావాలని సూచించారు. బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిలు,ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో సోమవారం మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అకాల వర్షాలతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని పార్టీ నేతలకు సూచించారు. అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు వెన్నంటే ఉండాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ సూచించారు.

నష్టానికి గురైన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాలని వారితో అన్నారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్నారు. ఉపాధి హామీ, పట్టణ, పల్లె ప్రగతి వంటి అభివృద్ధి కార్యక్రమాల బిల్లుల చెల్లింపు పై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో పనులను వేగంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.