మోడీ ఇంటి దగ్గర ధర్నా కు పిలుపునిచ్చిన కేటీఆర్

వరి కొనుగోలు విషయంలో తెరాస సర్కార్..కేంద్రం తో ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మండలస్థాయి నిరసనలు , రహదారుల రాస్తారోకో చేసిన తెరాస..ఇప్పుడు మోడీ ఇంటి వద్ద ధర్నా చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 11 వ తారీఖున ఢిల్లీలో నరేంద్ర మోడీ ఇంటి దగ్గర ధర్నా చేయబోతున్నామని కేటీఆర్ ప్రకటించారు.

ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో కేంద్ర నిర్ల‌క్ష్య‌పూరిత వైఖ‌రిని నిర‌సిస్తూ రాజ‌న్న సిరిసిల్ల కేంద్రంలో టీఆర్ఎస్ చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష‌లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. బీజేపీ పార్టీకి చెందిన గ‌ల్లీ నాయ‌కులు ఒక మాట‌, ఢిల్లీ నాయ‌కులు ఒక మాట మాట్లాడి రైతుల్లో అయోమ‌యాన్ని సృష్టించారు. ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో ఎవ‌రిది తెలివి త‌క్కువ‌త‌నం.. మీ కేంద్రానిదా? తెలంగాణ రైతుల‌దా? అని కేటీఆర్ నిల‌దీశారు.

చాయ్ పే చ‌ర్చ అని అధికారంలోకి వ‌చ్చిన బీజేపీని త‌రిమికొట్ట‌డం ఖాయ‌మ‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు నూక‌లు తిన‌డం అల‌వాటు చేయాల‌ని నోరు పారేసుకున్న‌ గోయ‌ల్‌కు ఎంత బ‌లుపు, కండ‌కావ‌రం అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. పీయూష్ గోయ‌ల్ సిగ్గు, లజ్జ లేకుండా అబ‌ద్ధాలు చెబుతూ.. ఉప్పుడు బియ్యం కొన‌డం లేద‌ని చెప్తుండు. విద్వేషాన్ని రెచ్చ‌గొట్టేలా కేంద్ర‌మంత్రి మాట్లాడుతుండు. యాసంగిలో వరి సాగు చేయమని రైతులను బండి సంజయ్ రెచ్చగొట్టాడు.. కేంద్రాన్ని ఒప్పించి ప్ర‌తి గింజ‌ను కొంటామ‌ని చెప్పిండు. కానీ ఇప్పుడేమో ముఖం చాటేశాడు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి కూడా అబద్ధాలు చెప్పాడు. రా రైస్, బాయిల్డ్ రైస్‌ను కేంద్రతో కొనిపిస్తామని కిషన్ రెడ్డి చెప్పాడు.. ఆయ‌న కూడా ప‌త్తా లేడని కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ ప్రజలను నూకలు తినమన్న బీజేపీ నాయకులకు నూకలు లేకుండా చేద్దామని.. 8 వ తారీఖున తెలంగాణ లో ఉన్న ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగరాలి ప్రతి ఊర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనము చేయాలని పిలుపునిచ్చారు.