అమెరికాలో మరోసారి కాల్పులు..ఇద్దరి మృతి

నిందితుడి వివరాల కోసం ఆరా తీస్తున్న అధికారులు

Suspect and victim dead after shooting at New Hampshire State Hospital in Concord

న్యూయార్క్‌ః అమెరికాలోని న్యూహాంప్‌షైర్ రాష్ట్రంలో శుక్రవారం కాల్పుల కలకలం రేగింది. కాంకర్డ్‌ నగరంలోని సైకియాట్రిక్ ఫెసిలిటీ ‘న్యూహాంప్‌షైర్ హాస్పిటల్’ వద్ద గుర్తుతెలియని ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. హాస్పిటల్ వద్ద ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడ్డ దుండగుడిని హతమార్చామని వివరించారు. కాల్పుల సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకొని హాస్పిటల్ లాబీలో దాక్కున్న షూటర్‌ని కాల్చి చంపారని పోలీసు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం అక్కడి పరిస్థితి సాధారణంగా ఉందని, ఎలాంటి ఆందోళనలేదని పోలీసులు వివరించారు. కాగా పోలీసుల చేతుల్లో హతమైన వ్యక్తి ఎవరనేది ఇప్పటివరకు గుర్తించలేదని, అతడికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీస్తున్నట్టు వివరించారు. కాగా న్యూ హాంప్‌షైర్ హాస్పిటల్ మానసిక వైద్యశాల అని తెలిపారు. ఈ హాస్పిటల్‌కు వచ్చేవారు మెటల్ డిటెక్టర్ల గుండా వెళ్లాల్సి ఉంటుందని, ఒక పోలీసు అధికారి విధిలో ఉంటారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.