యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి సత్యవతి

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంతో మంత్రి సత్యవతి సోమవారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఉపఎన్నికల్లో విజయం ద్వారా మునుగోడు ప్రజలు టీఆర్ఎస్‌పై తమకున్న అభిమానాన్ని మరోసారి చాటారని మంత్రి అన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు మునుగోడు ఓటర్లకు రుణపడి ఉంటామని తెలిపారు.

దొంగ ప్రమాణాలు చేసిన బీజేపీ నాయకులకు లక్ష్మీనరసింహ స్వామి తగిన బుద్ధి చెప్పారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన సంకల్పంతో దేశంలో అన్ని రాష్ట్రాలలో గొప్ప అభివృద్ధిని తీసుకురావడం ఖాయమన్నారు. కేసీఆర్‌తోనే దేశంలో గిరిజనులు, దళితులు, రైతులు, మహిళలు సుభిక్షంగా ఉంటారని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీని ఆదరించిన ప్రజలందరికీ మంత్రి సత్యవతి ధన్యవాదాలు తెలిపారు.

ఇక మరికాసేపట్లో ప్రగతి భవన్ లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..సీఎం కేసీఆర్ ను కలవబోతున్నారు. ప్రభాకర్ రెడ్డితో పాటు మంత్రి జగదీష్ రెడ్డి, నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌ను కలవనున్నారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలో గెలిచి ఎమ్మెల్యే కానున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగానే కేసీఆర్‌ను కలుస్తున్నారని తెలుస్తోంది. ఉపఎన్నికలో గెలిచేందుకు కూసుకుంట్లకు కేసీఆర్ అభినందనలు తెలపనున్నారు.