గాయమైనప్పటికీ కేటీఆర్ వర్క్ ఆపలేదు..వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు

కాలికి గాయమైనప్పటికీ టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఖాళీగా ఉండకుండా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్​.. తన ట్విటర్​ ఖాతా ద్వారా వెల్లడించారు. తాను ఇంటి నుంచి పని చేస్తూ.. కొన్ని దస్త్రాలు పరిశీలిస్తున్నట్లు ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఇంట్లో కాలిజారిపడడంతో చీలమండకు గాయమైంది. ఈ క్రమంలో డాక్టర్స్ మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్​.. ఆయన అభిమానులతో ట్విటర్​ వేదికగా తెలిపారు. తన పుట్టిన రోజుకు ముందు రోజునే ఇలా జరగడంతో పార్టీ శ్రేణులు , అభిమానులు , కార్యకర్తలు తీవ్ర బాధకు లోనయ్యారు. ఇక కేటీఆర్ బర్త్ డే రోజున పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి త్వరగా కేటీఆర్ కోలుకోవాలని పూజలు చేసారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బర్త్ డే వేడుకలను టిఆర్ఎస్ నేతలు ఘనంగా జరిపారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ కేక్‌ కట్‌ చేశారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ తలసాని సాయి కిరణ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా.. మంత్రి కేటీఆర్‌పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఇసుకతో రూపొందించిన కేటీఆర్‌ చిత్రం (స్యాండ్‌ ఆర్ట్‌), త్రీడీ ప్రదర్శ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.