ఎన్నికల్లో కేసీఆర్​ బొమ్మతో గెలవలేదంటూ.. ఈటెల కీలక వ్యాఖ్యలు

etela-rajender

హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో కేసీఆర్​ బొమ్మతో గెలవలేదని..తన సొంత పనితీరుతోనే గెలుస్తూ వచ్చినట్టు తెలిపారు. పదవుల కోసం తెలంగాణ ఉద్యమంలో చేరలేదని చెప్పొచ్చారు. 2018 ఎన్నికల్లో తనను ఓడించాలని కేసీఆర్‌ కుట్ర పన్నారని ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై చేసిన విధంగానే ఇతర నేతలపైనా కేసీఆర్ ప్రయోగాలు చేశారని.. ఫలితంగా వారంతా ఓడిపోయారని.. తానొక్కడు మాత్రమే గెలిచానన్నారు. స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిని కేసీఆర్‌ సహించరని.. అతి విధేయంగా ఉండేవారినే నాయకుడిగా భావిస్తారని అన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక కేసీఆర్ తన బానిసలతో తిట్టించి సంబరపడుతున్నారన్నారు.

ఈ రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్ ను ఓడగొట్టాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందని..బీఆర్ఎస్ పెట్టినా గట్టెక్కలేరని విమర్శించారు. రాష్ట్రాన్ని పరిపాలించే ధైర్యం లేక వీఆర్వోలను తీసేశారని..వాళ్ల ఉసురు కేసీఆర్ కు తప్పకుండా తగుల్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, ఈటెల, హరీష్ రావు పాత్ర ఏంటో అందరికి తెలుసన్నారు. తన ప్రతిష్టని ఓర్వలేక చిల్లర ఆరోపణలు చేసి తనను బయటకి పంపించారన్నారు. కేసీఆర్ కంటే ఎక్కువ పరిచయాలు తనకు ఉన్నాయన్నారు.

ఇదిలా ఉంటె నిన్న ఈటెల చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. టిఆర్ఎస్ నేతలు బిజెపి తో టచ్ లో ఉన్నారని , ఈ నెల 27 తర్వాత భారీగా బిజెపి లో చేరబోతారని , రాబోయే ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయమని ధీమావ్యక్తం చేసారు. దీనిపై టిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు.