ఢిల్లీ లో ముగిసిన విపక్షాల భేటీ..

meeting-of-the-opposition-ended

ఢిల్లీ లో విపక్షాల భేటీ ముగిసింది. రాష్ట్రపతి ఎన్నికల క్రమంలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు విపక్షాలు కసరత్తు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపక్షాల సమావేశానికి గత వారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఏడుగురు ముఖ్యమంత్రులు సహా మొత్తం 19 రాజకీయ పార్టీలకు లేఖ రాశారు. కాగా ఈరోజు ఈ సమావేశం దిల్లీలోని కాన్​స్టిట్యూషన్​ క్లబ్లో జరిగింది. కొద్దీ సేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయాలని విపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి.

ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిపై విపక్ష పార్టీల నేతలు ఈ సమావేశంలో చర్చించారు. శరద్ పవార్ పేరును ప్రతిపాదించగా… ఆయన నిరాకరించారు. అయితే లెఫ్ట్ పార్టీలు మాత్రం మహాత్మాగాంధీ మనవడు గోపాలక్రిష్ణ గాంధీ పేరును సూచించాయి. అంశంపై గోపాల కృష్ణ గాంధీ కూడా స్పందించారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసేందుకు నా పేరు కూడా ప్రతిపాదించారు. అయితే, దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం అడిగాను. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకుమించి దీని గురించి మాట్లాడటం సరికాదు’’ అని ఆయన అన్నారు.

ఇక దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి ఎన్నిక అంత ఈజీ కాదు. లోక్ సభ సభ్యుడికి ఉండాల్సిన అర్హతలన్నీ ఉండి 35 ఏండ్లు నిండిన భారత పౌరులెవరైనా రాష్ట్రపతి పదవికి పోటీ చేయొచ్చు. అయితే వారు ఏ చట్టసభల్లో ప్రతినిధిగానూ, లాభదాయక పదవుల్లోనూ ఉండకూడదు. లోక్సభ, శాసన సభల ప్రజా ప్రతినిధులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే రాజ్యసభ ఎంపీల మాదిరిగానే దేశ ప్రథమ పౌరుడి ఎన్నిక కూడా పరోక్ష విధానంలో జరుగుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఎన్నుకోబడిన లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఓటేసే హక్కు అవకాశం ఉంటుంది. అదే అసెంబ్లీ విషయానికొస్తే కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. పార్లమెంటు, అసెంబ్లీల్లో నామినేటెడ్‌ సభ్యులు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కు ఉండదు. రాజ్యాంగంలోని ఆర్టికల్-324 ప్రకారం ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. పార్టీలు విప్ జారీ చేయడానికి వీల్లేదు.