హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనీ బిజెపి కుట్ర – కేటీఆర్

ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. జూన్ 2 తరువాత హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ను కాపాడుకోవాలన్నా, రాజ్యాంగాన్ని మార్చకుండా అడ్డుకోవాలన్న శక్తి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. కరీంనగర్ జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని కేటీఆర్ ప్రసంగించారు. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవటం ఖాయమేనని, బండి సంజయ్ షెడ్ కు పోవటం ఖాయమే కదా? అన్నారు. నిన్న మొన్నటి దాకా గౌరవమిచ్చిన పోలీసులు ఇప్పుడు తోక జాడిస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వని బీజేపీ.. తెలంగాణను ఎండబెట్టి ఇతర రాష్ర్టాలకు తీసుకెళ్లాలని చూస్తున్నదని చెప్పారు.

2026లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌, అసెంబ్లీ సీట్లను పునర్విభజన చేస్తుందని, కొన్ని కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారని, ఆ సమయంలో ఉత్తరాది రాష్ర్టాల్లో జనాభా ఎక్కువ, దక్షిణాది రాష్ర్టాల్లో తక్కువని చెప్పి దక్షిణాదికి తక్కువ నియోజకవర్గాలు ఏర్పాటు చేసే ప్రమాదం ఉన్నదని, అందుకే పార్లమెంట్‌లో కొట్లాడేందుకు బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉండాలని తెలిపారు. తమకు మూడింట రెండో వంతు మెజార్టీ ఇస్తే ఎస్టీ, ఎస్టీల రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని, రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నారని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉండాలని వెల్లడించారు. బీజేపీకి ఓటు వేస్తే వ్యవసాయ బావుల కాడ మోటర్లకు మీటర్లు పెట్టుడు పక్కా అని తెలిపారు. కేసీఆర్‌ ఉన్నన్ని రోజులు ఆపారని, రేవంత్‌రెడ్డికి అంత దమ్ము లేదని స్పష్టం చేశారు. ఆయన మీద కేసులు ఉన్నాయని, మోదీ బెదిరిస్తే భయపడతాడని ఎద్దేవా చేశారు.